మంకీపాక్స్ వైరస్పై అమెరికా కీలక నిర్ణయం

 మంకీపాక్స్ వైరస్పై అమెరికా కీలక నిర్ణయం

వాషింగ్టన్: మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది అమెరికా. అమెరికాలో కేసులు నమోదైన వెంటనే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన బైడెన్ సర్కార్.. మొత్తం ప్రపంచ దేశాలన్నీ సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఇప్పటికే న్యూయార్క్, ఇల్లినాయిస్ తదితర రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించగా.. తాజాగా మొత్తం దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. బైడెన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో మంకీపాక్స్ వైరస్ కట్టడికి ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఏర్పడిందని అమెరికా మానవ వనరులు, వైద్య శాఖ మంత్రి జేవియర్ బెక్రా తెలిపారు. అవసరమైన మేర అదనపు నిధులు విడుదల చేయడం.. డేటా సేకరణ, వైద్య చికిత్సలో అదనపు సిబ్బంది నియామకం, సహాయక చర్యలను పెంచడానికి వీలుగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు వివరించారు. వైరస్ ను ఎదుర్కోవడంలో మొత్తం ప్రపంచ దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని బైడెన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. 

ప్రపంచవ్యాప్తంగా 83 దేశాలకు పైగా వ్యాపించింది మంకీ పాక్స్. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 22 వేల 350 మంకీపాక్స్ కేసులు వచ్చాయి. అమెరికాలో మంకీపాక్స్  వైరస్ బారినపడిన వారి సంఖ్య 7వేలకు చేరుకుంది. దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో మూడో వంతు కేవలం న్యూయార్క్ నగరంలోనే ఉండడంతో హాట్ స్పాట్ గా ప్రకటించారు. వేగంగా విస్తరిస్తున్నందున మంకీ పాక్స్ బాధితుల సంఖ్య లక్షలకు చేరువయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్తగా గత రెండు వారాల క్రితమే ఇల్లినాయిస్, క్యాలిఫోర్నియా, న్యూయార్క్ రాష్ట్రాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తాజాగా మొత్తం అమెరికా దేశమంతా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. మంకీపాక్స్ వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. కరోనా తరహాలోనే మంకీపాక్స్ వైరస్ ను సీరియస్ గా తీసుకుని... కట్టడి కోసం  ప్రజలు సహకరించాలని అమెరికా ఆరోగ్యశాఖ కోరింది. మంకీపాక్స్ రూపంలో ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని అగ్రరాజ్యం హెచ్చరికలు జారీ చేసింది.