- 15–20 శాతం పడిపోయిన రోజువారీ కార్యకలాపాలు
- ఎల్‌పీజీ కొరతతో 10 శాతం రెస్టారెంట్లు బంద్
- విమానయాన రంగాన్నీ వెంటాడుతున్న యుద్ధం
- పెరిగిన టికెట్ క్యాన్సిలేషన్లు, ఇంధన ఖర్చులు
- నెల రోజుల్లో రూ.18 వేల కోట్ల నష్టం: పీహెచ్‌డీసీసీఐ
హైదరాబాద్, వెలుగు: పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల భారత రెస్టారెంట్, ఫుడ్ సర్వీసెస్, విమానయాన రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఎల్‌పీజీ కొరతతో రెస్టారెంట్ల కార్యకలాపాలు రోజుకి 15–-20శాతం పడిపోయాయి. దీంతో డైలీ రూ.2,650 కోట్లు, నెలకు రూ.79 వేల కోట్ల ఆర్థిక నష్టం జరుగుతోందని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (పీహెచ్‌డీసీసీఐ) రిపోర్ట్ తెలిపింది. దీని ప్రకారం, దిగుమతి ఖర్చులు, లాజిస్టిక్స్, ఎనర్జీ ధరలు పెరగడం వల్ల ముడిసరుకుల ఖర్చులు 10–15శాతం పెరిగాయి.
ఎల్‌పీజీ కొరతతో దేశవ్యాప్తంగా 10 శాతం రెస్టారెంట్లు మూతపడ్డాయని, 60–70 శాతం రెస్టారెంట్ల పని గంటలు తగ్గాయని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు సాగర్ దరియానీ అన్నారు. 2026లో ఫుడ్ సర్వీసెస్ మార్కెట్‌సైజు రూ.6.46 లక్షల కోట్లకు చేరుతుందని, రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు రూ.17,700 కోట్లకు పెరగనున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ఈ రంగం 85 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తోంది. కానీ ఎల్‌పీజీ కొరత దీర్ఘకాలం కొనసాగితే 5–7 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎయిర్‌లైన్స్ కంపెనీలపై పెనుభారం
ఇరాన్ యుద్ధం వల్ల భారత విమానయాన రంగం రూ.18 వేల కోట్లు నష్టపోయిందని పీహెచ్‌డీసీసీఐ రిపోర్ట్ తెలిపింది. టికెట్ క్యాన్సిలేషన్స్, ఎయిర్‌స్పేస్ రిస్ట్రిక్షన్లు, రూట్లను మార్చడం వల్ల ఇండస్ట్రీ ఇబ్బంది పడుతోందని వివరించింది. ‘‘ ముఖ్య మార్గాల్లో ప్రయాణ సమయం 2-4 గంటలు పెరగడంతో ఇంధన (ఏటీఎఫ్) వినియోగం, ఆపరేటింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఎయిర్‌లైన్ ఖర్చుల్లో ఇంధనం వాటా 35-40 శాతం ఉంటోంది. దీంతో కంపెనీల లాభాలు తగ్గిపోతున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతల వలన కనెక్టివిటీ తగ్గింది. టికెట్ ధరలు భారీగా పెరగడంతో విమాన ప్రయాణాలు తగ్గిపోయాయి. ముఖ్యంగా వినోద ప్రయాణాలు పడిపోయాయి. ఇరాన్–అమెరికా యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇప్పటివరకు ఇండియాకు వచ్చే విదేశీ పర్యాటకులు 15-20శాతం తగ్గారని అంచనా”అని ఈ రిపోర్ట్ వివరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో విమానయాన, రెస్టారెంట్ రంగాలను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది.
అంతర్జాతీయ ఎయిర్ రూట్లను విస్తరించడం, ఏటీఎఫ్–హాస్పిటాలిటీ–ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాల్లో పన్ను ఒత్తిడి తగ్గించడం, ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక మద్దతు ఇవ్వడం అవసరమని తెలిపింది. కాగా, దేశీయ టూరిజం డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, ఇంధన ఖర్చులు, ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల హాస్పిటాలిటీ రంగం లాభాలు తగ్గుతున్నాయి.

