ఇరాన్, అమెరికా చర్చలు.. ఫస్ట్ రౌండ్లో ఏమీ తేలలే

 ఇరాన్, అమెరికా చర్చలు..  ఫస్ట్ రౌండ్లో  ఏమీ తేలలే
  • ఇస్లామాబాద్​లో పాక్ మధ్యవర్తిత్వంలో ఇరాన్, అమెరికా చర్చలు
  • యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ స్పీకర్ ఘాలిబాఫ్ బృందాల భేటీ 
  • ఫస్ట్ రౌండ్ లో 2 గంటలపాటు చర్చలు.. ఒప్పందాలపై నోట్స్ మార్పిడి 
  • నేడు మరో రౌండ్ చర్చలు జరిగే అవకాశం 
  • షరతులపై పట్టువీడని ఇరు దేశాలు.. ఐదు గంటలు ఆలస్యంగా మీటింగ్ ప్రారంభం 
  • అంతకుముందు ఇరు బృందాలతో పాక్ ప్రధాని షరీఫ్ వేర్వేరుగా సమావేశం 
  • చర్చలు విఫలమైతే పరిస్థితి మరోలా ఉంటుందని ట్రంప్ హెచ్చరిక 

ఇస్లామాబాద్:  పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేదిశగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్​లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య శనివారం సాయంత్రం ముఖాముఖి చర్చలు ప్రారంభమయ్యాయి. సిటీలోని సెరెనా హోటల్ లో పాక్ మధ్యవర్తిత్వంలో రెండు గంటలపాటు జరిగిన మొదటి రౌండ్ చర్చల్లో ఇరుపక్షాలూ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయాయి. వీలైతే శనివారం రాత్రికే లేదంటే ఆదివారం రెండో రౌండ్ చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని పాక్, ఇరాన్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా ప్రతినిధి బృందానికి వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా.. ఆయనతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్​ కుష్నర్, పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ బృందానికి పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా.. విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ సహా ఇతర నాయకులు ఈ బృందంలో ఉన్నారు.


‘పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో విడివిడిగా సమావేశమైన తర్వాత, శనివారం సాయంత్రం ఇరాన్, అమెరికా మధ్య అధికారికంగా నేరుగా చర్చలు మొదలయ్యాయి’ అని పాక్ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య జరుగుతున్న ఈ మొదటి రౌండ్ ప్రత్యక్ష చర్చలు ముగిసిన తర్వాత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే, అమెరికా, ఇరాన్ మధ్య తొలి విడత ముఖాముఖి శాంతి చర్చలు ముగిశాయని మధ్యవర్తులకు సన్నిహితంగా ఉన్న వర్గాలు చెప్పినట్టు శనివారం రాత్రి ‘అల్ జజీరా’ వెల్లడించింది. మొదటి రౌండ్ ప్రత్యక్ష చర్చల్లో చర్చించిన ఒప్పందాలపై ఇరు పక్షాలు ఒకే అవగాహనతో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వీలుగా రాతపూర్వక పత్రాల(నోట్స్)ను మార్చుకుంటున్నారని తెలిపింది. తొలి రౌండ్ చర్చలు రెండు గంటల్లోపే  ముగిశాయి. తర్వాత రాత్రి భోజనం కోసం విరామం ఇచ్చారు. భోజన విరామం తర్వాత చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయని కూడా కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. చర్చలు కొనసాగుతున్నాయని, సాంకేతిక స్థాయి చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా మరో రౌండ్ చర్చలు జరిగే అవకాశం ఉందని చర్చల ప్రతినిధులకు సన్నిహితంగా ఉన్న ఒక అధికారిని ఉటంకిస్తూ ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సంస్థ 'నూర్ న్యూస్' వెల్లడించింది. ఈ చర్చలను పొడిగించి, ఒక కచ్చితమైన ఒప్పందానికి రావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

ఆలస్యంగా ప్రారంభమైన చర్చలు 

అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్​కు చేరుకున్నప్పటికీ చర్చలు 5 గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఇరు దేశాల ప్రతినిధులు పాక్ ప్రధాని షరీఫ్​తో విడివిడిగా సమావేశమయ్యారు. త్రైపాక్షిక చర్చలకు ముందు, కొన్ని ముందస్తు షరతులు నెరవేరిన తర్వాతే తాము అమెరికా, పాకిస్తాన్‌‌లతో చర్చల్లో పాల్గొంటామని ఇరాన్ తెలిపినట్లు అల్ జజీరా వెల్లడించింది. ముందుగా చర్చల నిబంధనల విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్దిచేసిన యురేనియంను వదులుకోవాలని, తన సైన్యంపై పరిమితులను అంగీకరించాలని ట్రంప్ ప్రభుత్వం 15 పాయింట్ల ఫ్రేమ్‌‌వర్క్‌‌ను రూపొందించినట్లు సమాచారం. దీనికి ప్రతిగా తమకు నష్టపరిహారం చెల్లించాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని అమెరికా గుర్తించాలని కోరుతూ తన స్వంత 10 పాయింట్ల ప్రణాళికను ఇరాన్ పంపింది.  

ఇరాన్ నిధుల అన్ ఫ్రీజ్​కు అమెరికా ఓకే? 

ఖతార్ సహా ఇతర దేశాల్లో ఫ్రీజ్ చేసిన 6 బిలియన్ డాలర్ల ఇరాన్ నిధులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిన తర్వాతే తాము చర్చల్లో పాల్గొన్నట్లు ఇరాన్ బృందం సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ ‘అల్ జజీరా’ వెల్లడించింది. ఇరాన్ సమర్పించిన 10 పాయింట్ల ప్రణాళికలో ఇది ప్రధాన డిమాండ్ అని తెలిపింది. అయితే ఇరాన్ ఆస్తుల విడుదలపై అమెరికా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని పేర్కొంది. 

వాన్స్ విమానానికి పాక్ ఎఫ్-16 జెట్ ల రక్షణ

ఇస్లామాబాద్ గగనతలంలోకి చేరుకున్న వెంటనే అమెరికా వైస్ ప్రెసిడెంట్ విమానానికి పాకిస్తాన్ ఎఫ్-16 యుద్ధ విమానాలు ఎస్కార్టుగా వెళ్లాయి. ఇస్లామాబాద్ సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌‌లో ల్యాండ్ కావడానికి ముందు, పాకిస్తాన్ గగనతలంలో అమెరికా వైమానిక దళానికి చెందిన బోయింగ్ సీ32ఏ విమానానికి ఎస్కార్ట్ గా ఐదు పాకిస్తాన్ ఎఫ్-16 విమానాలు ఎగురుతూ వచ్చిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. కాగా, ఆపరేషన్ సిందూర్ లో భారత వాయుసేన బాంబు దాడులతో ధ్వంసమైన నూర్ ఖాన్ బేస్​ను తాజాగా మరమ్మతులు పూర్తి చేసి, అమెరికా, ఇరాన్ ప్రతినిధుల విమానాల రాకపోకలకు వీలుగా సిద్ధం చేశారు. చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌‌లో ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు.

చర్చలు విఫలమైతే మరోలా ఉంటుంది: ట్రంప్ 

చర్చలు ప్రారంభమయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే, ట్రంప్ ప్రకటనకు ముందు, జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా బృందం దాదాపు 5 గంటల పాటు ఇస్లామాబాద్‌‌లో ఉన్నప్పటికీ ఇరాన్ అధికారులతో నేరుగా ఎటువంటి చర్చలు జరపలేదు. కాల్పుల విరమణ చర్చలకు కొన్ని భేదాభిప్రాయాలు, ముందస్తు షరతుల వల్ల అడ్డంకులు ఎదురవుతున్నాయనే వార్తల మధ్య.. ఐదు గంటల ఆలస్యం తర్వాత అధికారికంగా చర్చలు ప్రారంభమయ్యాయని ట్రంప్ తెలిపారు. ‘చర్చలు ఎలా సాగుతాయనే దానిపై అవగాహనలేదు కానీ ఇరాన్ ఎంత చిత్తశుద్ధితో ఉందనేది మాత్రం వెంటనే చెప్పేస్తా’ అని అన్నారు. హార్మూజ్ జలసంధి త్వరలోనే పునఃప్రారంభమవుతుందని ట్రంప్ నొక్కి చెప్పారు. ఇరాన్‌‌ను ఒక ‘విఫల దేశం’ అని సంబోధిస్తూ, దౌత్య ప్రయత్నాలు విఫలమైతే అమెరికా తన పంథాను మార్చుకోవడానికి (రీసెట్) సిద్ధంగా ఉందని, అవసరమైతే కఠినమైన 
ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

ప్రతి సీట్లో బూట్లు.. స్కూల్ బ్యాగులు..   


టెహ్రాన్‌‌‌‌: పాకిస్తాన్‌‌‌‌తో కీలక శాంతి చర్చల కోసం బయలుదేరిన ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మినాబ్‌‌‌‌ స్కూల్‌‌‌‌ చిన్నారులకు వినూత్న రీతిలో నివాళులర్పించింది. స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలీబాఫ్ నేతృత్వం లోని ఈ బృందం.. విమానంలోని సీట్లలో  చిన్నారుల ఫొటోలు, వారి స్కూల్ బ్యాగులు, రక్తంతో తడిసిన బూట్లను, గులాబీలను ఉంచి ఇస్లామాబాద్‌‌‌‌కు భావోద్వేగా యాత్ర చేసింది. ప్రపంచానికి శాంతి సందేశం పంపింది. చిన్నారుల మృతికి నివాళిగా ఆ విమానానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఘాలీబాఫ్ తన సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ చేస్తూ.. ఆ చిన్నారుల చిత్రాలే ఈ చర్చలకు తమ ప్రతినిధులని పేర్కొన్నారు. ‘ఎక్స్’లో షేర్ చేసిన వీడియోలో ఆయన చిన్నారుల వస్తువులను ఆవేదనతో చూస్తూ కనిపించారు. ఇరాన్​లోని మినాబ్ వద్ద ఉన్న ఐఆర్‌‌‌‌‌‌‌‌జీసీ నావికాదళ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా– ఇజ్రాయెల్‌‌‌‌ జరిపిన దాడిలో, పక్కనే ఉన్న ఒక ప్రాథమిక పాఠశాల ధ్వంసమైంది. ఈ ఘటనలో సుమారు 168 మంది విద్యార్థులు, పౌరులు మరణించారు.

ఇరాన్​కు చైనా వెపన్స్​!

వాషింగ్టన్: శాంతి చర్చల వేళ ఇరాన్​కు చైనా ఆయుధాలు సమకూర్చే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు సీఎన్ఎన్ శనివారం ఓ కథనం వెలువరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణను ఉపయోగించుకుని, ఇరాన్  కొన్ని ఆయుధ వ్యవస్థలను మళ్లీ సేకరించేందుకు ప్రయత్నిస్తోందని, అంతర్జాతీయ భాగస్వాముల సహాయం పొందుతున్నదని రిపోర్టు పేర్కొంది. పలు ఆయుధాలను చైనా థర్డ్ కంట్రీ ద్వారా ఇరాన్ కు చేరవేయనుందని అందులో తెలిపింది. మ్యాన్ ప్యాడ్లు (భుజంపై ఉంచి ప్రయోగించే 
యాంటీ ఎయిర్ క్రాఫ్ట్  మిసైల్స్) కూడా ఆయుధ సరఫరాలో ఉన్నాయని వెల్లడించింది. కాగా.. సీఎన్ఎన్  నివేదికను చైనా ఖండించింది. 

సీ మైన్స్​ ఏడున్నయో ఏమో?
హార్మూజ్​ జలసంధిని పూర్తిగా తెరవలేకపోతున్న ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైర్​ నేపథ్యంలో హార్మూజ్ జలసంధిని తెరవాల్సిన ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఈ జలసంధిని పూర్తిగా పునరుద్ధరించడంలో అశక్తత వ్యక్తం చేస్తోంది. యుద్ధ ఉద్రిక్తతల సమయంలో శత్రువుల రాకపోకలను అడ్డుకోవడానికి ఇరాన్ స్వయంగా అమర్చిన సీమైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పుడు ఆ దేశానికే పెద్ద సమస్యగా మారాయి. వీటిని ఎక్కడెక్కడ అమర్చారో గుర్తించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల తర్వాత.. ఇరాన్ చిన్న బోట్ల ద్వారా ఈ జలసంధిలో గందరగోళంగా సీమైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమర్చింది. వీటి అమరికపై ఇరాన్ వద్ద స్పష్టమైన రికార్డులు లేవు. అమెరికా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఈ సీమైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అస్తవ్యస్తంగా అమర్చింది. ప్రస్తుతం వాటికి ఉన్న పరికరాలు కొట్టుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ప్రపంచంపై ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 25 శాతం రవాణా హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలసంధి ద్వారానే జరుగుతుంది. ట్రంప్ షరతు నేపథ్యంలో హార్మూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జలసంధిని తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అయితే, సీమైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమాదం పొంచి ఉండటంతో.. షిప్పింగ్ కంపెనీలకు ఇరాన్ ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీసీ కీలక సూచనలు జారీ చేసింది. సీమైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున.. నౌకలు ప్రధాన మార్గానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించింది.