యుద్ధంలో కీలక పరిణామం.. ఖర్గ్ ద్వీపంపై బాంబులేసిన అమెరికా.. ఇక ఇరాన్ పనైపోయినట్టేనా !

యుద్ధంలో కీలక పరిణామం.. ఖర్గ్ ద్వీపంపై బాంబులేసిన అమెరికా.. ఇక ఇరాన్ పనైపోయినట్టేనా !

టెహ్రాన్: ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్పై అమెరికన్ వైమానిక దళాలు విరుచుకుపడ్డాయని, బాంబుల వర్షం కురిపించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఐలాండ్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపినట్లు ట్రంప్ తెలిపారు. అంతేకాదు.. ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.

అమెరికా దళాలు ఇరాన్‌పై "ఈరోజు అత్యంత తీవ్రమైన దాడులు" నిర్వహిస్తాయని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ చెప్పిన కొన్ని గంటల్లోనే ఖర్గ్ ఐలాండ్పై అమెరికా ఈ దాడులు చేయడం గమనార్హం. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. " కొన్ని క్షణాల క్రితం, నా ఆదేశాల మేరకు, మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని అత్యంత శక్తివంతమైన బాంబు దాడులలో ఒకదాన్ని  యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ అమలు చేసింది. ఇరాన్ రత్న కిరీటంగా చెప్పుకునే ఖర్గ్ ద్వీపంలోని ప్రతి సైనిక లక్ష్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది " అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఖర్గ్ ద్వీపం ఇరాన్ దేశ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం. ఇరాన్ తీరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పగడపు దీవి అయిన ఖర్గ్ ద్వీపం ఇరాన్కు అతి ముఖ్యమైన ఆర్థిక భాండాగారం. ఇరాన్ ముడి చమురు ఎగుమతులన్నీ దాదాపు ఈ ద్వీపం గుండానే జరుగుతాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, ఇరాన్ దాదాపు 13.7 మిలియన్ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసింది. ఇరాన్ ఆదాయంలో చమురు ఎగుమతులదే కీలక పాత్ర. ఖర్గ్ ద్వీపంపై ఏదైనా దాడి జరిగితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినడం ఖాయం. అలాంటి దాడి టెహ్రాన్‌లోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఇరాన్ ఆర్థిక మూలాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో ఇరాన్లో ఏర్పడే ప్రభుత్వ మనుగడను కూడా ప్రశ్నార్థకం చేస్తుంది. ఇరాన్ ఆర్థిక మనుగడకు ఖర్గ్ ద్వీపం కేంద్ర బిందువు. ఇరాన్ ప్రభుత్వానికి, సైన్యానికి నిధులు సమకూర్చడంలో ఈ ద్వీపం అత్యంత కీలకం.