ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ ఖవాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుని విస్మరించిందని ఆరోపించారు. గతంలో సైనిక పాలకులు చేసిన తప్పిదాలవల్లే ప్రస్తుతం దేశం ఉగ్రవాద కోరల్లో చిక్కుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
అమెరికా తన ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను వాడుకున్నదని తెలిపారు. 1999 కార్గిల్ యుద్ధం, 9/11 దాడుల తర్వాత ఆ దేశంతో చేతులు కలపడం వల్ల పాక్ కోలుకోలేని నష్టాన్ని చవిచూసిందని చెప్పారు. ‘‘అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాక్‌ను అడ్డం పెట్టుకుంది. ఆ తర్వాత కనీసం గౌరవించకుండా, ఒక వస్తువులా వాడుకుని విసిరేసింది’’ అని ఫైర్ అయ్యారు.
పాక్‌లో టెర్రరిజానికి ఆ నియంతలే కారణం
అమెరికా నేతృత్వంలోని అఫ్గాన్ యుద్ధాల్లో తాలిబన్లకు వ్యతిరేకంగా పాక్ పోరాటం చేసిందని డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఖావాజా పేర్కొన్నారు. చివరకు ఈ ప్రాంతం నుంచి అమెరికా వైదొలిగినప్పటికీ పాక్‌లో మాత్రం హింస, టెర్రరిజం, ఆర్థిక సంక్షోభం మిగిలిపోయాయని వెల్లడించారు. అఫ్గాన్ యుద్ధాల్లో పాక్ పాల్గొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది కేవలం అగ్రరాజ్యాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇద్దరు సైనిక నియంతలు (జియా-ఉల్-హక్, పర్వేజ్ ముషారఫ్) చేసిన తప్పిదమని స్పష్టం చేశారు.
‘‘మనం చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు.. చేసిన తప్పులను అంగీకరించడం లేదు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న టెర్రరిజం ఆనాటి నియంతలు చేసిన తప్పుల ఫలితమే’’ అని ఆయన కుండబద్ధలు కొట్టారు. పాకిస్తాన్ విద్యావ్యవస్థను కూడా ఈ యుద్ధాలకు అనుగుణంగా మార్చివేశారని, ఆనాటి భావజాలం ఇప్పటికీ వ్యవస్థల్లో పాతుకుపోయి ఉందని ఆసిఫ్ ఖవాజా ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేమని, ఆ తప్పులు పాకిస్తాన్ భవిష్యత్తును వెనక్కి తీసుకెళ్లాయని నేషనల్ అసెంబ్లీలో ఖవాజా అంగీకరించారు.
