రాష్ట్రంలో అందరికీ ఒకేసారి టీకా

రాష్ట్రంలో అందరికీ ఒకేసారి టీకా
  •     100 రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సర్కారు నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అందరికీ ఒకేసారి టీకా వేయాలని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్ణయించింది. హెల్త్ వర్కర్స్,​ 50 ఏండ్లు పైబడిన వ్యక్తులకు కలిపి మొత్తం 80 లక్షల మందికి ముందుగా టీకా ఇవ్వాలని సర్కారు భావించింది. అయితే, అందరికీ ఒకేసారి వ్యాక్సిన్‌ వేయడానికి ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తోంది. చిన్న పిల్లలు, హెల్త్‌ బాగున్న యూత్‌ను టీకా ఇవ్వడం నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.

రూ.11 కోట్లతో కోల్డ్ చైన్ వ్యవస్థ

రాష్ట్రంలో ప్రస్తుత 3.60 కోట్ల మంది జనాభా ఉండవచ్చని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అంచనా వేసింది. అందులో 20 శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చి ఉంటుందని తాజాగా చేసిన పరిశోధనలు, అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే 15 ఏళ్లలోపు పిల్లలు, ఆరోగ్యవంతులైన యువతకు కూడా టీకాలు ఇవ్వడం లేదు. మొత్తంగా 1.65 కోట్ల మందికి ఫస్ట్‌ ఫేజ్‌లో టీకా ఇవ్వాలని సర్కారు టార్గెట్ పెట్టుకుంది. అందుకు తగినట్లుగా కోల్డ్ చైన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 14 రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నారు. ఇప్పటికే 180 క్యూబిక్ మీటర్ల వరకు ఉన్న కోల్డ్ స్టోరేజీల కెపాసిటీని 284 క్యూబిక్ మీటర్లకు పెంచాలని నిర్ణయించారు. దీనికోసం రూ.11 కోట్లను టీఎస్ఎంఎస్ఐడీపీ ఖర్చు చేయనుంది. టీకాలు వేయడానికి ఆటో డిస్పోజబుల్ సిరంజీలు తెప్పిస్తున్నారు.

రాష్ట్రంలో 9,157 మంది ఏఎన్‌ఎంలు..

రాష్ట్రంలో 9,157 మంది ఏఎన్‌ఎంలు ఉన్నారు. ప్రతి లక్షమందికి 28 మంది ఏఎన్ఎంలు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో కేంద్రంలో వంద మందికి చొప్పున 10 వేల కేంద్రాల ద్వారా పది లక్షల మందికి రోజూ వ్యాక్సినేషన్ చేయనున్నారు. కేంద్రం సూచించే 3 కోట్ల మందికీ నెల రోజుల్లో టీకా వేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ తర్వాత రెండో డోస్​ ప్రారంభించి వంద రోజుల్లో అందరికీ వ్యాక్సిన్‌ ఇస్తామంటున్నారు.