గజ్వేల్(వర్గల్), వెలుగు: సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. మట్టి తరలింపు అంశం ఈ ఘర్షణకు కారణమైంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం వర్గల్ మండలం మల్లారెడ్డిపల్లి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీకి అవసరమైన మట్టిని కాంగ్రెస్ నాయకులు ములుగు మండలం నుంచి తరలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ కార్యకర్తలు మట్టి తీసుకెళ్తున్న లారీలను అడ్డుకొని, గౌరారం పోలీసులకు అప్పగించారు. మరో రెండు లారీలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ లీడర్లు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, బీఆర్ఎస్ నాయకులు కావాలనే అడ్డుకుంటున్నారని వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
ఈ ఘటనలో కాంగ్రెస్ నాయకుడు పొన్నాల నర్సారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకుని రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ నాయకులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో వర్గల్ సర్పంచ్ కొడుకు నాగరాజుపై గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు దాడి చేశారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ లీడర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
పోలీసులు వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపారు. మట్టి తరలింపుపై అనుమతులు, లావాదేవీలపై కూడా అధికారులు విచారణ చేపడుతున్నారు.
