కేరళ సీఎంగా వీడీ సతీషన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2026 మే 18న 13వ ముఖ్యమంత్రిగా సతీషన్ ప్రమాణం చేశారు. ఉదయం 10 గంటలకు తిరువణంతపురం సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ ఆర్లేకర్ సతీషన్ చేత ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే, పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ,కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర నేతలు, ప్రముఖులు హాజరయ్యారు.
పదేళ్ల తర్వాత కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతోంది. ఎల్డీఎఫ్ కూటమిని ఓడించి అఖండ మెజారిటీ సాధించిన యూడీఎఫ్ కూటమి ప్రభుత్వ అధినేతగా సతీషన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు గవర్నర్ ఆర్లేకర్.
కేరళ ఎన్నికల్లో మొత్తం 140 సీట్లున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 102 సీట్లు సాధించి స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న సతీషన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 60 ఏళ్ల తర్వాత కేబినెట్ మొత్తం సీఎం ప్రమాణ స్వీకారం రోజే ప్రమాణం చేయడం విశేషం. యూడీఎఫ్, ఐఎంయూఎల్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
- వి.డి. సతీసన్ బాల్యం, చదువు
వి.డి. సతీసన్ 1964, మే 31న కొచ్చిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం చాలా ఉన్నతమైంది. ఆయన సోషల్ వర్క్‌లో పీజీ (MSW) చేశారు. ఇంకా న్యాయశాస్త్రంలో ఎల్‌ఎల్‌బి (LLB), ఎల్‌ఎల్‌ఎమ్ (LLM) పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు సుమారు పదేళ్ల పాటు కేరళ హైకోర్టులో పేరున్న లాయర్‌గా పనిచేశారు.
- స్టూడెంట్ లిడర్ నుండి ముఖ్యమంత్రి వరకు
సతీసన్ ప్రస్థానం కాలేజీ రాజకీయాల నుంచే మొదలైంది. ఆయన కేరళ విద్యార్థి సంఘం (KSU) నాయకుడిగా ఉంటూ జాతీయ స్థాయికి అప్పటి నుండి వరుసగా ఆరు సార్లు (2001 నుండి 2026 వరకు) పారావూర్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నారు.
- ఎన్నికల్లో విజయం
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సతీసన్ నాయకత్వంలో కాంగ్రెస్ కూటమి (UDF) అద్భుత ప్రదర్శన చేసింది. మొత్తం 140 సీట్లలో 102 సీట్లు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. సతీసన్ సొంత నియోజకవర్గంలో 20,600 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
- సతీసన్ ప్రత్యేకత ఏమిటి?
అసెంబ్లీలో విషయ పరిజ్ఞానంతో, ఆధారాలతో మాట్లాడటంలో ఆయన దిట్ట. కొచ్చి ప్రాంతంలోని అనేక కార్మిక సంఘాలకు ఆయన అధ్యక్షుడిగా ఉంటూ కార్మికుల పక్షాన నిలబడ్డారు. చదువు, ఆరోగ్యం, రోడ్ల అభివృద్ధి వంటి విషయాల్లో అతని నియోజకవర్గంలో వినూత్న మార్పులు తెచ్చారు.
