నవంబర్ 17 లోపు అయోధ్య వివాదంపై తీర్పు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

నవంబర్ 17 లోపు  అయోధ్య వివాదంపై తీర్పు.. రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

అయోధ్య – బాబ్రీ మసీదు వివాదం కేసులో సుప్రీంకోర్టు మరికొన్ని రోజుల్లో తీర్పు  ప్రకటించనుంది. దీంతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా భద్రతా ప్రణాళికతో సన్నద్ధమయ్యారు.  మొత్తం  నాలుగు రకాల ప్లాన్ లతో  అయోధ్య అంతటా భద్రతా కలిపించే దిశగా చర్యలు చేపట్టారు. ఒక ప్లాన్ ఫెయిలైనా మరో ప్లాన్ అమలు చేసేలా ఫుల్ ప్రిపరేషన్ తో ఉన్నారు.

తీర్పుకు ముందే అయోధ్య ఆలయ పరిసరాల ప్రాంతంలో 12,000 మంది పోలీసులను మోహరించింది అక్కడి ప్రభుత్వం. హోం మంత్రిత్వ శాఖ 4,000 పారా మిలటరీ జవాన్లను పంపింది. ఉత్తర ప్రదేశ్ పోలీసుల ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కాన్స్టాబులరీ (పిఎసి) తో సహా వచ్చే వారంలో మరిన్ని బలగాలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. అయితే సెక్యూరిటి కారణంగా సిటీలో ఎలాంటి కర్ఫ్యూ విధించబోమని, స్కూళ్లు ,కాలేజీలు యథావిధిగా కొనసాగుతాయని అక్కడి అధికారులు తెలిపారు. ఈ వివాద కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును నవంబర్ 17 లోపు ప్రకటించే అవకాశం ఉంది. మరో వైపు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ తీర్పు నేపథ్యంలో  సాధారణ హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.