విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత జంటగా నటిస్తున్న సినిమా ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. రీసెంట్గా ఈ చిత్రానికి సంబంధించిన తన పోర్షన్ షూటింగ్‌ను రష్మిక కంప్లీట్ చేయగా, తాజాగా మూవీ షూట్ మొత్తం పూర్తయిందని మేకర్స్ తెలియజేశారు.
మొత్తం 130 రోజుల పాటు భారీ ఎత్తున, హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో చిత్రీకరణ జరిపామని, షూట్ కంప్లీట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్లోకి అడుగుపెట్టామని వెల్లడించారు. 19వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనలో చోటుచేసుకున్న వాస్తవ చారిత్రక ఘటనల స్ఫూర్తితో రూపొందుతోంది. ఆర్నాల్డ్ వోస్లో కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి అజయ్, అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.
