వర్సిటీలపై సర్కారు దృష్టికి తీసుకెళ్తా: వినోద్ కుమార్

వర్సిటీలపై సర్కారు దృష్టికి తీసుకెళ్తా: వినోద్ కుమార్
  • అన్ని వర్సిటీలు జట్టుగా ఏర్పడి చర్చించాలి
  • వర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు ఉండాల్సిందే
  • రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.  శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన రాష్ట్రంలోని వర్సిటీల అధ్యాపకుల సమావేశానికి ఆయన చీఫ్​గెస్టుగా హాజరై మాట్లాడారు. అధ్యాపకుల సమస్యలను సానుకూలంగా విన్న ఆయన వారం రోజుల్లోనే సెక్రటేరియట్​లో సమావేశమై పరిష్కారానికి కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. అధ్యాపకుల నియామకాల అంశం రాష్ట్రపతి పరిధిలో ఉందని, తిరిగి అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. అధ్యాపకుల పదవీవిరమణ వయసు పెంపుపైనా  సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తానన్నారు. పీఆర్సీ బకాయిలు, ఆరోగ్య కార్డుల కోసం కూడా మాట్లాడుతానని స్పష్టం చేశారు. 

అన్ని వర్సిటీలు జట్టుగా ఏర్పడి సమస్యలతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై చర్చలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్​ఏయూటీఏ) ఏర్పాటు చేస్తున్నట్లు సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యాసంస్థల్లో ఎన్నికలు ఉండాల్సిందేనని, వర్సిటీల్లో  విద్యార్థులకు రాజకీయ భాగస్వామ్యం లేకుండా కుట్ర జరుగుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. అదేవిధంగా రాష్ర్టంలోని 12 వర్సిటీల్లోని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను  క్రమబద్ధీకరించాలని కాంటాక్ట్ టీచర్స్ జేఏసీ ప్రతినిధులు వినోద్ కుమార్​ను కలిసి వినతిపత్రం అందించి కోరారు.