వైరల్ వీడియో: కీపింగ్‌లో రిషబ్ పంత్ మెరుపులు

వైరల్ వీడియో: కీపింగ్‌లో రిషబ్ పంత్ మెరుపులు

అహమ్మదాబాద్: భారత జట్టులో  సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మ్యాచ్.. మ్యాచ్ కు రాటుదేలుతున్నాడు. మైదానంలో మరింత పరిణతి కనబరుస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో తనదైన శైలి బ్యాటింగ్ తో శెభాష్ అనిపించుకున్నాడు. ఓ వైపు బౌలర్లు పట్టుబిగిస్తుంటే ఎదురొడ్డి నిలిచి వీరోచితంగా సెంచరీ చేసి భారతజట్టుకు ఆపద్బాంధవుడిగా నిలిచాడు. ముఖ్యంగా సిక్సర్ తో సెంచరీ కొట్టి సచిన్, సెహ్వాగ్ లను గుర్తుకు తెచ్చాడు.  118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసి వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి భారతజట్టుకు బలమైన భాగస్వామ్యం నిర్మించాడు. అదే ఊపులో కీపింగులోనూ మెరుపులు మెరిపిస్తూ.. అందర్నీ అలరించాడు.ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు పంత్ మెరుపులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ముఖ్యంగా వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ పంత్ చేసిన జిమ్నాస్టిక్ ఫీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇషాంత్‌ శర్మ బౌలింగ్ సందర్భంగా  ఓ బంతిని పట్టుకునే క్రమంలో పంత్‌ ఊహించనిరీతిలో అదిరిపోయే ఫీట్ చేశాడు. గుడ్‌ లైన్ అండ్ లెంగ్త్‌తో ఇశాంత్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్‌ డిఫెన్స్ చేయగా.. అది కాస్త ఒక్క కీపర్‌ వద్దకు వెళ్లింది. పంత్‌ బంతిని పట్టుకుంటూ కింది పడ్డాడు. వెంటనే జిమ్నాస్టిక్‌ తరహాలో ఓ జంప్ ఫీట్‌ తో ఎగిరి యథాస్థానంలో నిలబడ్డాడు.  పంత్‌ దగ్గరకు సర్దిచెప్పేందుకు వచ్చిన కెప్టెన్ కోహ్లి.. పంత్ ఎగిరి నిలబడిన ఫీట్‌ చూసి ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి వీడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది. మ్యాచ్ లో  భారతజట్టు 89 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో రోజు టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేయగా ఒక్క పంత్ స్కోరే 101 పరుగులు ఉంది. ఆట ముగిసే సమయానికి వాషింగ్టన్‌ సుందర్‌ 60 పరుగులతో అజేయంగా ఉన్నాడు.