అడవులను కాపాడుకోవాలి...త్వరలో చెన్నూరులో 100 పడకల ఆస్పత్రి ప్రారంభిస్తం : మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

అడవులను కాపాడుకోవాలి...త్వరలో చెన్నూరులో 100 పడకల ఆస్పత్రి ప్రారంభిస్తం : మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
  •     రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి
  •     మంచిర్యాల లైబ్రరీని పరిశీలించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ 
  •     జర్మనీ భాష పాఠాలు విన్న మంత్రి.. అవగాహన కల్పించిన ఎంపీలు

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు:  పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాల మనుగడకు అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర కార్మిక, గనులు శాఖ మంత్రి గడ్డం వివేక్ ​వెంకటస్వామి అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్​అటవీ రేంజ్​ పరిధి కిష్టంపేటలోని అంబేద్కర్​ అర్బన్​ పార్కులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి మంత్రి చీఫ్ ​గెస్ట్​గా హాజరయ్యారు. కలెక్టర్ కుమార్ ​దీపక్, జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్​ జాదవ్​తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చెన్నూరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని.. ఇక్కడి మొసళ్ల పార్క్, ఇతర ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. గతేడాది కంటే ఈసారి అధిక దిగుబడి వచ్చిందని, లారీలు, హమాలీల సమస్యలను పరిష్కరించుకుంటూ దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గడువు కంటే ముందుగానే కొనుగోలు చేశామన్నారు.

చెన్నూర్ లో 5 పడకలతో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు స్థానికంగా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. చెన్నూరు మండల కేంద్రంలో చేపట్టిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అన్ని రకాల వైద్య సేవలను అందిస్తామని, 23 మంది వైద్యులతో పాటు సిబ్బందిని నియమించి వైద్య పరికరాలు, ఫర్నిచర్ సమకూర్చుతున్నట్లు చెప్పారు. 10 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేసి అత్యవసర సేవలు అందిస్తామని, త్వరలోనే ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. సోమనపల్లిలో రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్​ రెసిడెన్షియల్​ స్కూల్​ఏర్పాటు చేసి 2 వేల మంది విద్యార్థులకు విద్యను అందిస్తామని, వచ్చే ఏడాది అడ్మిషన్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 

చెన్నూర్ నియోజకవర్గంలో  2 అడ్వాన్స్​డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు వృత్తి విద్య నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డివిజనల్​ అటవీ అధికారి కె.సర్వేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారి, ఎఫ్​ఆర్​వోలు, సర్పంచ్​లు తదితరులు పాల్గొన్నారు.

జర్మనీ భాష పాఠాలు విన్న మంత్రి

మందమర్రిలోని సింగరేణి స్కిల్​ డెవలప్​మెంట్ సెంటర్​లో టామ్​కామ్ ​ఆధ్వర్యంలో కొనసాగుతున్న జర్మన్​ భాషా శిక్షణ తరగతులను అభ్యర్థులతో కలిసి మంత్రి వివేక్ వెంకటస్వామి విన్నారు. గంటసేపు జర్మనీ భాష పాఠాలు నేర్చుకున్నారు. అనంతరం పెద్దపల్లి, జహీరాబాద్​ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, సురేశ్ షెట్కార్ స్కిల్ ​డెవలప్​మెంట్ సెంటర్​ను సందర్శించారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. యువత విదేశీ భాషలపై పట్టు సాధించాలన్నారు. 

జర్మనీతో పాటు ఇతర దేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడి వారికి అవగాహన కల్పించారు. అంతకుముందు మంత్రి వివేక్ ప్రాణిహితకాలనీలో కమ్యూనిటీ హాల్​ను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తన కార్పొరేషన్​ చైర్మన్​అన్వేష్​ రెడ్డి, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం రాధాకృష్ణ, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

లైబ్రరీల్లో సదుపాయాలు కల్పించాలి: ఎంపీ వంశీ

మంచిర్యాల జిల్లాలోని లైబ్రరీల్లో పాఠకులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేశ్​తో కలిసి సందర్శించారు. లైబ్రరీలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లాలోని లైబ్రరీల్లో పాఠకులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, మెటీరియల్, సదుపాయాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.