
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తుండడం, మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉండడంతో ప్రమాదాలు జరగకుండా వాటర్‌బోర్డు మాన్సూన్యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి నగరంలో భారీ వర్షం కురవడంతో మెయిన్రోడ్లపై ఉన్న మ్యాన్హోల్స్తెరవకుండా ప్రత్యేక సిబ్బందిని అందుబాటులో ఉంచింది. అలాగే, మ్యాన్ హోల్స్ఓపెన్చేస్తే క్రిమినల్కేసులు పెడతామని హెచ్చరించింది.
రోడ్లపక్కన, కూడళ్లలో మ్యాన్ హోల్స్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ నుంచి సీవర్ ఇన్ స్పెక్టర్ నేతృత్వంలో సీవరేజీ టీమ్ఏర్పాటు చేసింది. వీరు ప్రతిరోజూ ఉదయాన్నే ఫీల్డ్‌కు వెళ్లి పర్యవేక్షిస్తారు. అలాగే, ఎక్కడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా లేదా ఇతర సమస్యలు, ఫిర్యాదులుంటే వాటర్‌బోర్డు కస్టమర్ కేర్ నంబర్155313కు తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దగ్గర్లోని వాటర్‌బోర్డు కార్యాలయాల్లో కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
25 వేల మ్యాన్ హోళ్లపై సేఫ్టీ గ్రిల్స్
మ్యాన్హోల్మూత తెరిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని, నిందితులకు జరిమానాతో పాటు కొన్ని సార్లు జైలు శిక్ష కూడా పడుతుందని వాటర్‌బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. సిటీలో లోతైన మ్యాన్ హోళ్ల తో పాటు 25 వేలకు పైగా మ్యాన్ హోళ్లపై ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ బిగించారు. మెయిన్రోడ్లపై ఉన్న వాటిని కవర్స్ తో సీల్ చేసి, రెడ్ పెయింట్వేశారు.
మాన్సూన్ యాక్షన్‌ప్లాన్ ఇలా
వర్షాకాలం మాన్సూన్యాక్షన్ప్లాన్లో భాగంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆర్టీ), సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ (ఎస్పీటీ) వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. ఫీల్డ్‌లో పని చేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించారు. ఈ బృందాలకు కేటాయించిన వాహనాల్లో జనరేటర్‌తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది.
దీని సాయంతో వర్షపు నీటిని తొలగిస్తారు. అధికంగా నీరు నిలిచే ప్రాంతాలపై ఈ బృందాలు దృష్టి సారిస్తాయి. వీటితో పాటు ఎయిర్ టెక్ మిషన్లు సైతం అందుబాటులో ఉన్నాయి. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలు (సిల్ట్) ని ఎప్పటికప్పుడు తొలగిస్తారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి విధులు నిర్వర్తించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర సమయాల్లో ఎలా పనిచేయాలనే దానిపై శిక్షణ కూడా ఇస్తున్నారు.