జంట రిజర్వాయర్లలో నీటి దొంగలు.. డైరెక్ట్ పైపులైన్లు వేసి ఎత్తుకపోతున్నరు

జంట రిజర్వాయర్లలో నీటి దొంగలు.. డైరెక్ట్ పైపులైన్లు వేసి ఎత్తుకపోతున్నరు
  •     రిజర్వాయర్ల పక్కనే బోర్లేసి తోడేస్తున్న ఇంకొందరు  
  •     ట్యాంకర్లలో నింపి సిటీలో అమ్మకాలు
  •     మూడు నెలల్లో రూ.7 కోట్లు కొల్లగొట్టిన ఓ వ్యాపారి 
  •     హైడ్రా చూసుకోవాలి అంటున్న వాటర్​ బోర్డు 
  •     తమకు సంబంధం లేదన్న హైడ్రా చీఫ్

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్​కు తాగునీటిని అందిస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్​సాగర్​, హిమాయత్ సాగర్ ​రిజర్వాయర్ల వద్ద నీటి దొంగలు రెచ్చిపోతున్నారు. జలాశయాల నుంచి ఏకంగా పైపులేసుకొని మోటార్లు పెట్టుకుని దర్జాగా తోడుకుపోతున్నరు. ఇంకొందరు జలాశయాల పక్కనే బోర్లు వేస్తున్నారు. ఈ నీళ్లను వాటర్ ​ట్యాంకర్లలో నింపి ఎండాకాలం సీజన్​లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. గత మూడు నెలల్లో ఒక్క వ్యాపారే రూ.7 కోట్ల వరకు కొల్లగొట్టగా, వందల సంఖ్యలో ఉన్న ఇతరులు ఎంత సంపాదిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నమ్మశక్యంగా లేకున్నా వాస్తవంగా జరుగుతున్నదిదే. ఇదంతా బహిరంగమే అయినా, ఉన్నతాధికారులకు మాత్రం కనిపించడం లేదు. ప్రతి వేసవిలో ట్యాంకర్ల నిర్వాహకులు ఈ అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు పర్యవేక్షణ చేయకుండా పరోక్షంగా వారికి మద్దతునిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత వాటర్​బోర్డుదే అయినా తమకు సంబంధం లేదని హైడ్రా పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది.

11 ప్రాంతాల్లో బిజినెస్

రిజర్వాయర్ల పరిధిలోని 11 ప్రాంతాల్లో ప్రతీ ఎండాకాలంలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఉస్మాన్​సాగర్​పరిధిలోని జన్వాడ, ఖానాపూర్, వట్టి నాగులపల్లి, హిమాయత్ సాగర్​పరిధిలోని హిమాయత్​సాగర్​విలేజ్, మొయినాబాద్, అజీజ్​నగర్, కొత్వాల్​గూడ, మంచిరేవుల, కిస్మత్​పూర్, పుప్పాల గూడ, మణికొండ వంటి ప్రాంతాల్లో నీళ్లను తోడుతూ ట్యాంకర్లలో నింపి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.

డైరెక్ట్​ రిజర్వాయర్ ​నుంచే..

అందరూ రిజర్వాయర్ల సమీపంలో బోర్లు వేసి నీటిని తోడుతుంటే.. ఒకరు మాత్రం డైరెక్ట్​గా హిమాయత్​సాగర్ రిజర్వాయర్ ​నుంచి పైపులైన్​ వేసుకొని దర్జాగా నీటిని తరలించి అమ్ముకుంటున్నాడు. సంధ్య కన్వెన్షన్ ప్రాంగణంలో బోర్లు వేయడంతో పాటు, నేరుగా పైపులను జలాశయంలోకి వేసి మోటార్లతో తోడుతున్నాడు. ఇలా ఎండాకాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో వాటర్​ట్యాంకర్లను అమ్ముకున్నట్టు సమాచారం. ఒక్కో ట్యాంకర్​కు రూ.6 వేల చొప్పున వసూలు చేస్తున్నారు.

నీళ్లతో కోట్లు కొట్టేశారు..

హిమాయత్​సాగర్​పరిధిలో రిజర్వాయర్​లోకి డైరెక్ట్​పైపులైన్​వేసిన వారు 20 ట్యాంకర్లతో ఎండాకాలం నీళ్ల దందా చేస్తున్నారు. ఈ సారి మార్చిలోనే ఎండలు మొదలుకాగా, రోజూ ఒక ట్యాంకర్​ఆరు ట్రిప్పుల చొప్పున నెలకు 180 ట్రిప్పుల నీటిని తరలించింది. ఈ లెక్కన మొత్తం 20 ట్యాంకర్లు 3,600 ట్రిప్పులు వేయగా.. మూడు నెలలకు ఇది 10,800 ట్రిప్పులవుతుంది. ఒక్కో ట్యాంకర్​కు రూ.6 వేల చొప్పున వేసుకున్నా ఈ నీళ్ల దందాతో రూ.6,48,00,000 కొల్లగొట్టారు. 

ఎవరికి సరఫరా చేస్తున్నారంటే..

వెస్ట్​ సిటీలో వాటర్​బోర్డు 24 గంటలూ తమ వాటర్​ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తోంది. అయినా, నీళ్లు సరిపోవడం లేదు. దీంతో ఆ గ్యాప్​ను ఫిలప్​చేసి దండుకోవాలని నీటి అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, అపార్ట్​మెంట్లు, హాస్టల్స్, హోటల్స్, రెస్టారెంట్ల నుంచి డిమాండ్​ఉండడంతో రిజర్వాయర్ల నుంచి ఎన్ని ట్రిప్పులంటే అన్ని ట్రిప్పలు ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నరు.

వాటర్​ బోర్డే చూసుకోవాలె

వాటర్​బోర్డు అధికారులు నీటి దొంగతనం అరికట్టే బాధ్యత హైడ్రాదే అని స్పష్టం చేయడంతో ఈ విషయం గురించి వీ6 వెలుగు హైడ్రా చీఫ్​రంగనాథ్​ను సంప్రదించింది. ‘‘లేక్​ ప్రొటెక్షన్​ బాధ్యతలు మాకు అప్పగించింది నిజమే.. కానీ, జంట జలాశయాలకు సంబంధించి ఎక్కడైనా ఆక్రమణలు జరిగితే తొలగించడం వరకే మా బాధ్యత. జలాశయంలో నీరు, నీటినీ ట్యాంకర్ల ద్వారా తరలిస్తే దానికి హైడ్రా ఎలా బాధ్యత వహిస్తుంది. ఈ వ్యవహారాన్ని వాటర్​బోర్డే అరికట్టాలి’’ అని ఆయన తెలిపారు.

అండ ఉంది.. అదరరు.. బెదరరు..

హిమాయత్​సాగర్​లో ​ఈ దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నది. స్థానికంగా పలుకుబడి ఉన్న వారు, పొలిటికల్​లీడర్ల అండదండలున్నాయంటూ నీళ్లను తోడుకుపోతున్నారు. నిజానికి ఈ రెండు రిజర్వాయర్ల ఎఫ్టీఎల్, బఫర్​జోన్ల పరిధిలో నీటి ట్యాంకర్ల వ్యాపారం పూర్తిగా నిషిద్ధం. ఈ నిబంధనలేవీ వారు పట్టించుకోవడం లేదు. రిజర్వాయర్ల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో బోర్​వెల్ వేసేందుకు కూడా అనుమతి లేదు. అయినా, ప్రతి ఎండాకాలం బోర్లు వేసి ట్యాంకర్లలో నింపి అమ్ముకుంటూనే ఉన్నారు.