మాట తప్పేది లేదు.. కొంత ఆలస్యమైనా పథకాలన్నీ అమలు చేస్తాం : తుమ్మల

మాట తప్పేది లేదు..  కొంత ఆలస్యమైనా పథకాలన్నీ అమలు చేస్తాం : తుమ్మల
  •  19న సీఎం రేవంత్​ సభ సక్సెస్​ చేయాలి 
  • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు

మహబూబాబాద్, వెలుగు : పథకాల అమలులో మాట తప్పేది లేదని, మడమ తిప్పబోమని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కొంత ఆలస్యమైనా అన్ని పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. మంగళవారం మహబూబాబాద్​లో కాంగ్రెస్​ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ, రూ.2లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని పంటలకు బోనస్ ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయంగా మారిందని, గొర్రెలు, బర్రెల స్కీమ్​లలోనూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 

19న బలరాం నాయక్​ నామినేషన్.. సీఎం సభ

ఈనెల 19న మహబూబాబాద్ లో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ వేయనున్నారని, భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని చారిత్రక ఘట్టంగామార్చాలన్నారు. అదేరోజు జరిగే బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారని చెప్పారు. సభను విజయవంతం చేయాలని కోరారు. సభ నిర్వహణ కోసం ఎన్టీఆర్​ స్టేడియాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్​, డీసీసీ అధ్యక్షుడు భరత్​చందర్​ రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్​ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రు నాయక్​, ఎమ్మెల్యేలు మురళీ నాయక్​, దొంతి మాధవ రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గోన్నారు.