'రామరాజ్యం' గురించి పెద్ద మాటలు చెప్పుంటరు ఇప్పటి పెద్దమనుషులు.. రామరాజ్యం అంటే తెలుసా?. దేశంలో లేదా రాష్ట్రంలో ప్రతి మనిషి సంతోషంగా జీవిస్తూ.. సుభిక్షంగా ఉండటమే రామరాజ్యానికి నిర్వచనం. మరి ఇప్పుడు రామరాజ్యం రావాలంటే మళ్లీ రాముడు పుట్టి ఏలాల్నా? అవసరంలేదు. ఇప్పుడున్న పాలకులు రాముని గుణగణాలు తెలుసుకుని.. ఆవరణలో పెడితే చాలు!
రాజు ఎట్ల ఉంటే ప్రజలు కూడా అట్లనే ఉంటరు. పాలకుడు దుర్మార్గంలో ప్రయాణిస్తే.. ప్రజలు కూడా దుఃఖ మార్గంలోనే నడుస్తరు. సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించంగనే అయిపోదు.. రాముడి పరిపాలనా దక్షతను పాలకులు పట్టుకోవాలె. శాస్త్రం చెప్పినట్టు ధర్మబద్ధంగా నడుచుకోవాలె. లేకుంటే అప్పటివరకు రామరాజ్యం ఉపన్యాసాలకే పరిమితమైతది..
కొడుకు ఎలా ఉండాలి? కోడలు ఎలా ఉండాలి? అసలు మనిషి ఎలా ఉండాలో చూపించినరు సీతారాములు. భక్తులమని చెప్పుకునేటోళ్లు.. బొట్టు పెట్టుకుని.. కొబ్బరి కాయలు కొడితే సరిపోదు. వాళ్లు భక్తులుగా మారినందుకు ఆ దేవుళ్లు. నడిచిన దారిలో నడవాలె. వాళ్లు చేసిన ఉపకారం చేతనైనంత మందికి చెయ్యాలె!
ఏం నేర్చుకోవాలి?
రాముడిలో ఎన్నోఉత్తమ గుణాలనుగుర్తించినడు వాల్మీకి మహర్షి. అవన్నీఇప్పటికీ ఆచరించదగినవి.. ఆచారించాల్సినవి. అందంగా, ప్రేమగా మాట్లాడటం రాముడికే సాధ్యం. కోపంగా మాట్లాడేవారి దగ్గర వెర్రికేకలు వేసే వాళ్ల దగ్గర రాముడు సమాధానం చెప్పడు. ఆ క్షణంలో మౌనంగా ఉంటాడు. దెబ్బ తిన్నాక వాళ్లే మారుతరని ఆయన నమ్మకం అంతకుముందు వంద అపకారాలు చేసినా.. ఒక్క ఉపకారం చేస్తే.. వాళ్లని ఎన్నోసార్లు స్మరించుకుంటడు. ఎవరు అపకారం చేసినా గుర్తు చేసుకోడు. 'ఇది మంచిది.. ఇది కాదు అని జడ్జ్ వెయ్యగల బుద్ధికుశలత ఉన్నవాడు. ఇతరులను ద్వేషించడు. ఆయన మధురభాషి. ఆయన మాట్లాడుతంటే వినేవాళ్లకు సంతోషం కలుగుతుందట.
పూర్వభాషిత్వం... తనే ముందే మాట్లాడుతడు. ఎవరూ కలిసినా 'అయ్యా బాగున్నవా? "అని ప్రియంగా మాట్లాడుతడు. అంతేగాని... 'ఏం సార్ ఎదిగిపోయారు.. మేమెక్కడ కనపడ్తం మీకు అని ఎటకారంగా ఎన్నడూ ముచ్చట మొదలుపెట్టడు. పాఠాలు గుర్తొచ్చినప్పుడు తన గురువులను స్మరించుకుంటదు. అన్నింటికన్నా గొప్పగుణం సాత్వికులను ఎలా రక్షించాలో రాముడికి తెలుసు. ఎలా సంపాదించాలి. ఎంత ఖర్చుపెట్టాలో కూడా ఆయనకు తెలుసు. తనకు కావాల్సిన వాటికోసం ఖర్చు పెట్టకపోతే తనకు తాను ద్రోహం చేసుకున్నట్టు. తనకు అవసరం లేకున్న వృథా ఖర్చు చేస్తే.. భావితరాలకు ద్రోహం చేస్తున్నట్టని అనాడే చెప్పిండు. ఇన్ని గుణాలు ఉన్నందుకే ఆయన మర్యాద రాముడు అనిపించుకున్నడు.
పుణ్యం కోసం రామనామం స్మరించడంలో నిజమైన భక్తి లేదు. సీతారాముల మార్గాన్ని అనుసరించి, ఆచరించడమే అసలు భక్తి. అట్ల చేస్తే మిమ్మల్ని మీరు సంస్కరించుకున్నట్టే. తద్వారా సమాజాన్ని కూడా సంస్కరించినట్లే! కనీసం ఇప్పటి నుంచైనా పాలకులు.. రామరాజ్యం స్థాపించే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం. . !
