- సీఎం రేవంత్‌ను నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
- కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా గురించి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన తెలంగాణకు ఏం లాభమని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. కర్నాటకలోని తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినందుకు సంబురాలు చేసుకోవడం ఆపి, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి సీఎం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌చేశారు. ‘‘తుంగభద్ర డ్యామ్, ఆర్డీఎస్ మధ్యలో దాదాపు 35 టీఎంసీలు వాడుకునేలా కర్నాటక ప్రభుత్వం నవేలి రిజర్వాయర్ నిర్మించాలని చూస్తోంది.
ఆర్డీఎస్, సుంకేసుల మధ్య 20 టీఎంసీలు వాడుకునేలా గుండ్రేవుల ప్రాజెక్టు కట్టాలని ఏపీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకు గండిపడుతుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా రేవంత్ రెడ్డి ఎందుకు అభ్యంతరం తెలపలేదు? తెలంగాణకు దక్కాల్సిన 15.90 టీఎంసీల వాటాను సాధించారా? ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్డీఎస్ సమస్యలను పరిష్కరించారా? రాష్ట్రానికి మేలు చేసే ఈ కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి కచ్చితమైన హామీలేమైనా తీసుకున్నారా? ఈ ప్రధాన సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండా జరిగిన సమావేశం సువర్ణ అధ్యాయం ఎలా అవుతుంది’’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
కేవలం తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన రాష్ట్రానికి రావాల్సిన 15.90 టీఎంసీల నీరు ఎలా వస్తుందో సీఎం సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర నీటి హక్కులకు ముప్పుగా మారే కొత్త ప్రాజెక్టులను సీఎం ఎందుకు వ్యతిరేకించలేకపోయారని నిలదీశారు.
