వీల్ చైర్ షటిల్ క్రీడాకారుడు మాదాసు శ్రీనివాసరావు మృతి 

వీల్ చైర్ షటిల్ క్రీడాకారుడు మాదాసు శ్రీనివాసరావు మృతి 

వీల్ చైర్ షటిల్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పుట్టకతోనే వైకల్యం వచ్చినా ఎంతో పట్టుదలతో క్రీడల్లో రాణించారు. వీల్ చైర్ షటిల్‌తో పాటు పలు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ పతకాలు సాధించిన మాదాసు శ్రీనివాసరావు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. 

మాదాసు శ్రీనివాసరావు సొంతూరు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి. అంగవైకల్యంతో పుట్టిన ఆయన వీల్ చైర్ సహాయంతో బ్యాడ్మింటన్ ఆడేవారు, షాట్ పుట్ విసిరేవారు, టేబుల్ టెన్నిస్ ఆడేవారు. పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా సాధించారు. 24 దేశాల్లోని అంతర్జాతీయ వేదికలపై బ్యాడ్మింటన్ ఆడి దేశానికి ఎన్నో పతకాలు తీసుకువచ్చారు. శ్రీనివాసరావు ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం.. 2003లో అర్జున అవార్డుతో సత్కరించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఆయన మృతి పట్ల క్రీడాకారులు, అభిమానులు, నేతలు సంతాపం తెలిపారు.