ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు ఇంకెప్పుడిస్తరు?

ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు ఇంకెప్పుడిస్తరు?

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్ ఆర్టీవో సేవలు లేట్​అవుతున్నాయి. పది రోజుల్లో ఇంటికి చేరాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కార్డులు నెలలు గడుస్తున్నా పెండింగ్ లోనే ఉంటున్నాయి. ఆర్టీవోల చుట్టూ వాహనదారులు తిరుగుతునా టైమ్​కు సేవలు పొందలేకపోతున్నారు. ముఖ్యంగా కొత్త వాహనదారులు, ఆర్సీ ట్రాన్స్ ఫర్ చేసుకున్నవారికి కొత్త సమస్యలను తీసుకువస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా 11 ఆర్టీవోల్లో ఏకంగా 60 వేలకు పైగా స్మార్ట్ కార్డులు గతేడాది కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయి. ఏజెంట్ల చేయి తడిపితే గంటల్లో పనైపోతుండడంపై విమర్శలు వస్తున్నాయి.  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కొత్త కారు లేదా బైక్​, కమర్షియల్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత కనీసం రెండు నెలలు ఎదురు చూస్తేనే రిజిస్ట్రేషన్ కార్డు చేతికి అందే పరిస్థితి ఉంది.  దీంతో ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో కార్డులు లేకపోవడంతో ఫైన్లు పడుతున్నాయి.
వందల్లో చార్జీలు... సేవల్లో లేటు
డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ తో పాటు రెన్యూవల్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్, డూప్లికేట్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి సేవల కోసం  రోజూ ఆర్టీవో ఆఫీసులకు వందల్లో వెళ్తుంటారు. ఒక్కో ఆర్టీవో ఆఫీసులో కనీసం 500 నుంచి 600 మంది అప్లై చేసుకుంటుంటారు.  వారం రోజుల్లో ఇవ్వాల్సిన డ్రైవింగ్, ఆర్సీ కార్డులను సకాలంలో జారీ చేయకపోవడంతో కొనుగోలు చేసిన బండ్లతో రోడ్డెక్కాలంటేనే భయపడిపోతున్నారు. నెలల తరబడి స్మార్ట్ కార్డుల కోసం తిరగాల్సి వస్తుందని వాహనదారుల వాపోతున్నారు. కారు ఆర్సీ కోసం దరఖాస్తు చేసుకుంటే సర్వీసు చార్జీల పేరిట రూ. 400, స్మార్ట్ కార్డు కోసం రూ. 200, పోస్టల్ ఫీజుల పేరిట మరో రూ. 35 ఆర్టీవో వసూలు చేస్తుంది.  వారం రోజుల్లో ఇంటికి చేరాల్సిన కార్డులు  నిలిచిపోతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. లాక్ డౌన్ కంటే ముందు నుంచి ఇదే సమస్య ఉండగా, స్మార్ట్ కార్డు మెటీరియల్ సప్లయ్ చేయడంలో లేటు జరుగుతుండడంతోనే  కార్డుల జారీ సజావుగా సాగట్లేదు.