హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టిని నిర్మిస్తే కాంగ్రెస్ కు ఎక్కడ పేరు వస్తుందేమోననే భయంతో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఆ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం సీఎల్పీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు మహారాష్ట్ర సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఆ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని ఇప్పటికే తమ మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు సందర్శించారని, దీన్ని సాధ్యమైనంత త్వరగా నిర్మించాలనే పట్టుదలతో తమ సర్కారు ఉందన్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేల కోట్లను ఖర్చు చేసిందని, కెనాల్స్ కూడా చాలా వరకు తవ్వకాలు జరిగాయని చెప్పారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అనుమతి ఇప్పిస్తే ప్రాజెక్టు పనులు పూర్తవుతాయన్నారు. ఏపీ బీజేపీ నేతలు పోలవరం కోసం కొట్లాడి 7 మండలాలను సాధించుకుంటే...తెలంగాణ బీజేపీ నేతలు తుమ్మిడిహెట్టి కోసం ఎందుకు పోరాడరని ప్రశ్నించారు.
