- బీజేపీని నిలదీసిన విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ ఎందుకు యూ టర్న్ తీసుకుందని విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. సోమవారం సీఎల్పీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీల ద్రోహి బీజేపీ అని, దీనిపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘బిహార్ లో ఎన్డీఏ కూటమి ఈబీసీలకు 65 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించింది. ఆ బిల్లు చట్టంగా మారి అమలవుతోంది. తెలంగాణలో మాత్రం బీసీ బిల్లుకు బీజేపీ అడ్డుపడుతున్నది.
ఈ విషయంలో బిహార్ కు ఓ న్యాయం, తెలంగాణకు మరో న్యాయమా?” అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో బీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించని బీజేపీ సర్కారు.. తెలంగాణలో మాత్రం ముస్లింలను అడ్డం పెట్టుకొని 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ఏందని ఫైర్ అయ్యారు. కాగా.. ఓట్ల చోరీపై ఢిల్లీ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంకను అరెస్టు చేయడాన్ని ఆది శ్రీనివాస్ ఖండించారు. మోదీ సర్కారు నియంతృత్వ పాలనకు కాంగ్రెస్ నేతల అరెస్టు ఉదాహరణ అని విమర్శించారు.

