- ఒళ్లంతా పీక్కుతిన్న కుక్కలు
- పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో దారుణం
సుల్తానాబాద్, వెలుగు : కుక్కల దాడిలో మూడేండ్ల చిన్నారి చనిపోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్సై అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రానికి బుబున్ బెహరా భార్య, ముగ్గురు పిల్లలతో ఆరు నెలల కింద సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి వలస వచ్చి ఇటుక బట్టీల్లో పనిచేస్తున్నాడు. సోమవారం సెలవు కావడంతో ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు, బుబున్ బెహరా కుటుంబసభ్యులు సుల్తానాబాద్ వెళ్లారు.
బాలింత అయిన బుబున్ బెహరా భార్య ఇంట్లో ఉండగా.. వారి మూడేండ్ల కూతురు దివ్య బెహరా తోటి పిల్లలతో ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఈ సమయంలో కుక్కలు పిల్లలపై దాడి చేయడంతో వారంతా తలోవైపు పరుగు తీశారు. దివ్య బెహరాపై కుక్కలు దాడి చేసి.. అక్కడి నుంచి ఈడ్చుకెళ్లి సమీపంలోని పొల్లాల్లో పడేశాయి. కొద్దిసేపటి తర్వాత దివ్య కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పొలాల్లో వెతకగా దివ్య డెడ్‌బాడీ దొరికింది. చిన్నారి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

