రాజకీయ నాయకులు తాము చెప్పిన మాటల మీద వాళ్లే నిలబడరు అని మరో సారి ప్రధాని మోడీ నిరూపించారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం 2013లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక ఘటన.. ఇప్పుడు 2026లో మళ్లీ తెరపైకి వచ్చి రాజకీయ దుమారం రేపుతోంది. అప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు అదే దారిలో వెళ్తుండటంపై నెటిజన్లు సెటైర్లతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఈ గోల్డ్ పాలిటిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
చిదంబరంపై మోడీ నిప్పులు.. మరి ఇప్పుడు
ఆనాడు 2013లో దేశ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంది. రూపాయి విలువ పడిపోవడం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోవడంతో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. "దేశ ప్రయోజనాల దృష్ట్యా భారతీయులు బంగారం కొనడం తగ్గించాలి" అని కోరారు. ఈ ప్రకటనపై అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గుజరాత్ సీఎంగా మోడీ కామెంట్స్..
"చిదంబరం గారూ.. మేం మీ అంత చదువుకున్న వాళ్లం కాదు, టీ అమ్ముకుని ఇక్కడికి వచ్చాం. కానీ మా తల్లులు, చెల్లెమ్మల మెడలోని మంగళసూత్రాలను లాక్కోవాలని చూడటం సరికాదు" అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పేదల పొదుపుపై ప్రభుత్వం కన్నేసిందని మోడీ అప్పట్లో నానా రాద్దాంతం చేసారు.
కట్ చేస్తే.. 2026లో అచ్చం అలాంటి పరిస్థితులే రిపీట్ అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రధాని మోడీ స్వయంగా ప్రజలను గోల్డ్ కొనవద్దని రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా.. సోషల్ మీడియా మాత్రం పాత వీడియోలను, వార్తలను బయటకు తీస్తోంది. సీఎంగా ఉన్నప్పుడు ఇదే నిర్ణయాన్ని ఎద్దేవా చేసిన మోడీ ఇప్పుడు అదే దారిని ఎందుకు ఎంచుకున్నారంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తే.. అప్పుడు మంగళసూత్రాలు.. ఇప్పుడు దేశభక్తి? అంటూ మోడీ పాత స్పీచ్‌లను రీ-షేర్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్లు చెబితే తప్పు.. మరి ఇప్పుడు మీరు చెబుతున్నది ఏమిటి? అని మరో యూజర్ పోస్ట్ చేశారు. మరికొందరైతే టైమ్ చక్రం లాంటిది ఎక్కడ మెుదలైందో అక్కడికే వస్తుందంటూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు మోడీ పాత కామెంట్లపై.
అప్పట్లో చిదంబరం చేసిన విజ్ఞప్తిని అసమర్థ పాలనగా చిత్రీకరించిన బీజేపీ.. ఇప్పుడు అదే బాటలో నడవడం రాజకీయాల్లో నైతికతపై చర్చను లేవనెత్తుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే విమర్శలు.. అధికారంలోకి వచ్చాక బూమరాంగ్ లాగా తిరిగి తగులుతాయని ఈ గోల్డ్ వార్ నిరూపిస్తోంది. మొత్తానికి 2013 నాటి మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే పెద్ద తలనొప్పిగా మారిపోయాయి.
