రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లరాశులు

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు..కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లరాశులు
  • కరీంనగర్​, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని పలు ప్రాంతాలు జలమయం
  • వచ్చే వారం రోజులు భారీ వర్షాలు పడతాయన్న ఐఎండీ.. ఎల్లో అలర్ట్​ జారీ 
  • కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంటర్​
  • 8 రోజులు ఆలస్యంగా ప్రవేశం.. రెండు మూడు రోజుల్లో రాష్ట్రానికి
  • వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో చురుగ్గా రుతుపవనాలు

హైదరాబాద్/నెట్​వర్క్​​, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మధ్యాహ్నం దాకా ఎండ దంచికొట్టినా, ఆ తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం సాయంత్రం దక్షిణ తెలంగాణలోని మూడు, నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రమంతా వర్షాలు కురిశాయి. కామారెడ్డి, కరీంనగర్, జనగామ జిల్లాల్లో గంటకు పైగా కుండపోత పడింది.  పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు పట్టణాల్లో భారీ వానలకు రోడ్లన్నీ జలమయమై.. రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక చోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న వడ్ల కుప్పలు తడిసిపోయాయి. 

కవర్లు కప్పిన చోట్ల కూడా నీటిప్రవాహానికి వడ్లు తడిశాయి. మరికొన్ని చోట్ల ధాన్యం వాననీళ్లలో కొట్టుకుపోయింది. ఈదురుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కామారెడ్డి జిల్లా భిక్నూరులో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా సదాశివనగర్​లో 9.7, కామారెడ్డిలో 9.3, జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​లో 7.5, కరీంనగర్​ జిల్లా ఈదులగట్టిపల్లిలో 6.7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. సంగారెడ్డి జిల్లా సిర్గాపూరులో 6.4 సెంటీమీటర్లు, కరీంనగర్​ జిల్లా పోచంపల్లిలో 6.3, కామారెడ్డి జిల్లా దోమకొండలో 6.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వీటితో పాటు మెదక్​, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ మోస్తరు వర్షపాతం నమోదైంది. 

కేరళలోకి నైరుతి.. 

నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించాయి. ఒక్కరోజులోనే ఆ రాష్ట్రమంతా విస్తరించాయి. ఇటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొద్ది భూభాగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాయి. వాస్తవానికి మే 26 నాటికే కేరళలోకి రుతుపవనాలు ఎంటరవుతాయని ఐఎండీ అంచనాలు విడుదల చేసింది. నాలుగురోజులు అటూఇటు అవుతుందని చెప్పింది. కానీ, ఐఎండీ అంచనాలు తలకిందులయ్యేలా.. ఎల్​నినో ఎఫెక్ట్​ రుతుపవనాలపై ప్రభావం చూపించింది. దీంతో అనుకున్నటైం కన్నా 8 రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ఎంటరయ్యాయి. ప్రస్తుతం రుతుపవనాల వేగం, ఎత్తు ఆశించిన స్థాయిలో ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల గమనానికి అనుకూలంగా ఉండే మేఘాలు పెరగడం, పశ్చిమ గాలుల ప్రభావం 4.5 కిలోమీటర్ల ఎత్తుకు చేరడం వంటి కారణాలతో రుతుపవనాల వేగం పెరిగినట్టు పేర్కొంది. పశ్చిమగాలుల వేగం కూడా గంటకు 25 నాట్స్​ వరకు ఉండడంతో అనుకూల పరిస్థితులు ఏర్పడి.. రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించినట్టు వెల్లడించింది. 

మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి..

నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రంలోకి కూడా వీలైనంత త్వరగానే ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు ఐఎండీ అంచనాల్లో వెల్లడించింది. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు ఈ వారాంతంలో విస్తరిస్తాయని తెలిపింది. అంటే ఆదివారం లేదా సోమవారం నాటికి మన రాష్ట్రంలోకీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోనూ రుతుపవనాల ప్రభావం మొదలైంది. 

రుతుపవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది దక్షిణ తెలంగాణ, యానాం పరిసరాల్లో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పరేచర్లు కూడా దిగొస్తున్నాయి. మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వారం రోజులకూ ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. వర్షాలతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హైదరాబాద్​ సిటీలోనూ శుక్రవారం నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురిసే చాన్స్​ ఉన్నట్టు వెల్లడించింది. ఈదురుగాలుల తీవ్రత కూడా ఉంటుందని పేర్కొంది. 

కాగా, రాష్ట్రంలో గురువారం గరిష్ఠంగా సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 43.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా భీమారంలో 43.5, ములుగు జిల్లా ధర్మవరంలో 43.4, ఖమ్మం జిల్లా బచ్చోడులో 43.3, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 43.2, జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాటారంలో 43 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డ్​ అయ్యాయి. కాగా, మెదక్​, నాగర్​కర్నూల్​, వికారాబాద్​, వనపర్తి, జోగుళాంబ గద్వాల, మహబూబ్​నగర్​, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో టెంపరేచర్లు 40 డిగ్రీలకన్నా తక్కువగానే నమోదయ్యాయి. హైదరాబాద్​ సిటీ పరిధిలోని 13 సర్కిళ్లలోనే 40 డిగ్రీల రేంజ్​లో టెంపరేచర్లు నమోదుకాగా.. మిగతా 17 సర్కిళ్లలోనూ 40 డిగ్రీలలోపే రికార్డయ్యాయి.  

సెంటర్ల దగ్గర తడిసిన వడ్లరాశులు

కరీంనగర్ సిటీలో గంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం వల్ల పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ ముందు పెట్రోల్ పంప్ దగ్గర ఈదురు గాలుల తాకిడికి హోర్డింగ్ ఫ్లెక్సీ చిరిగి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. జమ్మికుంట పట్టణంలో ఈదురు గాలులకు చెట్టు 11 కేవీ విద్యుత్ వైర్లపై పడడంతో మూడు గంటల పాటు కరెంటు సరఫరాకు అంతరాయం కలిగింది.  కామారెడ్డి జిల్లాలో భారీ ఈదురుగాలులతో గంటన్నర పాటు కురిసిన వర్షానికి పట్టణంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. రోడ్లమీద నీరు నిలవడంతో చాలాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, పాల్వంచ, గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, పిట్లం, బిచ్కుంద మండలాల్లో కురిసిన వానల వల్ల కొనుగోలు సెంటర్లలో వడ్ల కుప్పలు తడిసిపోయాయి. వివేకానంద కాలనీ వద్ద రైల్వే కాంపౌండ్ వాల్ కూలి విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్ పడిపోయి.. కరంట్​ సప్లయ్ నిలిచిపోయింది. 

గురువారం వీక్లి మార్కెట్​లో కూరగాయలు నీళ్లలో కొట్టుకుపోయి.. అమ్మకానికి తెచ్చిన రైతులు నష్టపోయారు. భిక్కనూరు మండలం బీటీఎస్ వద్ద చెట్లు, కరంటు స్థంభాలు పడిపోయాయి.  ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్ మండలాల్లో వడగండ్లు పడ్డాయి. సిరికొండ మండలం వాయిపేట గ్రామంలో వడగండ్ల వాన, గాలిదుమారానికి ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఇండ్లలో సరుకులు, వస్తువులు తడిసిపోయాయని గిరిజనులు కన్నీరుమున్నీరయ్యారు.  భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ. టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లితో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. జనగామ జిల్లాలోని పలు మండలాల్లో, యాదాద్రి జిల్లా బొమ్మల రామారం, తుర్కపల్లిలో వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడిసిపోయాయి. 

ఆసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలులతో ఆసిఫాబాద్​ మండలం కోసారా గ్రామంలో చౌహన్ దేవిదాస్ ఇంటిపైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆసీఫాబాద్​ పట్టణంలోని పైగాజి నగర్ కాలనీ రోడ్లు నీటమునగడంతో కాలనీవాసులు ఇబ్బందిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌‌ మండలంలో భారీ వర్షం కురిసింది. ​హుస్నాబాద్‌‌ వ్యవసాయ మార్కెట్‌‌ యార్డులో తూకంవేసి మిల్లుకు తరలించేందుకు ఉంచిన వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. కవర్లు కప్పినా కిందనుంచి నీరు చేరి ధాన్యం తడిసింది.