ఈసారైనా ప్రజా సమస్యలు చర్చకొచ్చేనా?

ఈసారైనా ప్రజా సమస్యలు చర్చకొచ్చేనా?

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ 4వ కౌన్సిల్ మీటింగ్ మంగళవారం హెడ్డాఫీసులోని కౌన్సిల్​ హాల్​లో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సమావేశం ప్రారంభం కాగానే ముందుగా క్వశ్చన్ అవర్ కొనసాగనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం ఇటీవల స్టాండింగ్ కమిటీ ఆమోదించిన 26 అభివృద్ధి పనులకి సంబంధించి ఆమోదం తీసుకోనున్నారు. మధ్యాహ్నం ప్రజా సమస్యలు చర్చకొచ్చే అవకాశముంది. అయితే ఇప్పటి వరకు జరిగిన 3 సమావేశాల్లో పెద్దగా చర్చలు జరగకుండానే వాయిదా పడ్డాయి. ఈసారైనా ప్రజా సమస్యలు చర్చించాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు.  ప్రతి సమావేశానికి సభ్యుల నుంచి వచ్చిన ఏ ఒక్క ప్రశ్నపై సుదీర్ఘంగా చర్చ జరగడం లేదు. సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసేలా జవాబులు ఇవ్వడం లేదు. అధికార పార్టీ సభ్యులకు మినహా మిగతా వారికి మాట్లాడేందుకు పెద్దగా అవకాశం ఇవ్వడం లేదంటూ పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న ప్రశ్నలపై మాత్రమే చర్చించకుండా ప్రతి సభ్యుడు అడిగిన ప్రశ్నలపై  చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సమస్యలపై  కౌన్సిల్​లో నిలదీసేందుకు బీజేపీ కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఎంఐఎం, కాంగ్రెస్  కార్పొరేటర్లు కూడా ఈ సారి అనేక  సమస్యలను లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.  గత సమావేశంలో ఎక్కువ టైమ్ ఎంఐఎం సభ్యులకే ఇచ్చారు. 

పలు కాలనీల్లో  పెండింగ్ సమస్యలు

బల్దియా కౌన్సిల్​ సమావేశంపై ఈసారి సిటిజన్లు సైతం ఆశలు పెట్టుకున్నారు. ఏండ్లుగా పెండింగ్​లో సమస్యలు పరిష్కారమవుతాయని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే  తమ కాలనీల్లో ఈ సమ
స్యలు ఉన్నాయంటూ సిటిజన్లు కార్పొరేటర్లు, అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. కౌన్సిల్​లో తమ  సమస్యలు చర్చకు వస్తే  పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.  మూడేళ్లుగా వర్షాలు కురిసిన ప్రతిసారి వందలాది కాలనీలు నీట మునుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎస్ఎన్ డీపీ(స్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రోగ్రామ్) ద్వారా నాలాల పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఈ వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని అధికార పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ, సీజన్ ముగుస్తున్నా పనులు పూర్తి కాలేదు.  దీంతో నాలాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరుపుతారని సిటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఇలా చెరువులు, మంచినీరు, డ్రైనేజీ, శానిటేషన్, దోమల బెడద తదితర అంశాలపై చర్చ జరగాలని  కోరుతున్నారు. 

ఈసారి తక్కువే..

గత కౌన్సిల్​ సమావేశాలతో పోలిస్తే ఈసారి ప్రశ్నలు తక్కువగా వచ్చాయి. గత సమావేశానికి అన్ని పార్టీల నుంచి 400 ప్రశ్నలు రాగా.. ఇందులో కేవలం 20 లోపు  ప్రశ్నలపైనే చర్చ జరిగింది. ఈ సారి 142 ప్రశ్నలు వచ్చాయి. ఇందులో కేవలం 23 ప్రశ్నలపై మాత్రమే చర్చించనున్నట్లు సమాచారం.  ప్రజా సమస్యలపై చర్చించాలని, ఎన్ని రోజులైనా సరే ప్రతి సమస్యకు పరిష్కారం లభించేలా చూడాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు కోరుతున్నారు. గతంలో మాదిరిగా వెంటనే సమావేశాన్ని వాయిదా వేయకుండా కనీసం రెండు, మూడు రోజులైనా నడపాలని అంటున్నారు. గత సమావేశంలో అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైనా సమాధానాలు ఇవ్వలేదంటున్నారు. 

కనీసం రెండ్రోజులైనా నిర్వహించాలె

ప్రజా సమస్యలపై చర్చ జరగాలంటే సమావేశాలను కనీసం రెండ్రోజులైనా నిర్వహించాలి. జీహెచ్ఎంసీ ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లోకి చేరింది. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం బల్దియాకు ఇవ్వడం లేదు. దీనిపై సమావేశంలో చర్చించాలి. ట్యాక్స్ ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో అన్ని పనులు చేయాలి. నగర శివారులో ఉన్న సీవరేజీ బోర్డుని వాటర్ వర్క్స్ నుంచి జీహెచ్ఎంసీలో కలపాలి. వాటర్ బోర్డు ద్వారా పనులు జరగడంలేదు. సమావేశంలో వాటర్ బోర్డు అధికారులను అందుబాటులో ఉంచి అన్నింటిపై సమాధానం ఇవ్వాలి.

- కొప్పుల నర్సింహారెడ్డి, బీజేపీ కార్పొరేటర్,

మన్సూరాబాద్ డివిజన్

గొడవలతోనే సరిపెడుతున్నరు..

గ్రేటర్ లో ఉంటోన్న కోటికి పైగా జనాభాకు సంబంధించిన అన్ని సమస్యలపై చర్చించాలె. కానీ సమావేశాలను గొడవలతో సరి పెడుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్​ కార్పొరేటర్లు  స్వార్థ  రాజకీయాల కోసం చర్చలు జరగకుండా చేస్తున్నారు. డివిజన్లలో ఎన్నో సమస్యలున్నాయి. మనల్ని నమ్మకంతో గెలిపించిన జనాల సమస్యలను పరిష్కారించాలి.  కానీ కౌన్సిల్ లో చర్చలు జరగడం లేదు. ఈసారైనా సభ్యులందరూ సిటీ డెవలప్ మెంట్ పై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలి.

-  రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్,     

లింగోజిగూడ డివిజన్