ప‌ని చేయ‌ని చైనా టెస్టు కిట్లు వెన‌క్కి పంపేస్తాం.. పైసా కూడా క‌ట్ట‌లేదు

ప‌ని చేయ‌ని చైనా టెస్టు కిట్లు వెన‌క్కి పంపేస్తాం.. పైసా కూడా క‌ట్ట‌లేదు

స‌రిగా ప‌ని చేయ‌ని క‌రోనా యాంటీబాడీ టెస్టు కిట్లను వెన‌క్కి పంపేస్తామ‌ని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్. ఇటీవ‌ల రాజ‌స్థాన్, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో చైనా నుంచి వ‌చ్చిన‌ ర్యాపిట్ టెస్టు కిట్లు త‌ప్పుడు ఫ‌లితాల‌ను చూపిస్తున్న విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా నియంత్ర‌ణ‌కు రాష్ట్రాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్, స‌హాయ మంత్రి అశ్వినీ చౌబే వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రాల వారీగా మంత్రులు త‌మ రాష్ట్రాల్లో తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ మాట్లాడుతూ.. రాష్ట్రాలకు భారీగా టెస్టు కిట్లు అందుబాటులోకి తెస్తున్నామ‌ని చెప్పారు. హాట్ స్పాట్స్ లో వేగంగా క‌రోనా పాజిటివ్ కేసుల‌ను వేగంగా గుర్తించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు. అయితే కొన్ని చోట్ల యాంటీ బాడీ టెస్టు కిట్లు త‌ప్పుడు ఫ‌లితాల‌ను చూపిస్తున్నాయ‌ని, వీటిని చైనా స‌హా ఏ దేశం నుంచి కొనుగోలు చేసినా స‌రే వాటిని వెన‌క్కి పంపాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ కిట్స్ కోసం ఒక్క పైసా కూడా చెల్లించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇంకా క‌ఠినంగా లాక్ డౌన్

దేశ వ్యాప్తంగా మొత్తం టెస్టుల్లో 4 శాతం కేసులు మాత్ర‌మే క‌రోనా పాజిటివ్ వ‌స్తున్న‌ట్లు చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్. మ‌న దేశంలో క‌మ్యూనిటీ ట్రాన్సిమిష‌న్ జ‌రుగుతుంద‌ని భ‌య‌ప‌డ్డామ‌ని, అయితే ఆ ద‌శ‌లోకి (స్టేజ్ – 3) వెళ్ల‌కుండా క‌ట్ట‌డి దేశాన్ని కాపాడుకోగ‌లిగామ‌ని అన్నారు. క్ల‌స్ట‌ర్లుగా మాత్ర‌మే క‌రోనా వ్యాప్తి ఉంద‌ని, ఆ ప్రాంతాల్లో కేసులు భారీగా ఉన్నాయ‌ని చెప్పారు. ఆ క్ల‌స్టర్స్ లో వైర‌స్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు లాక్ డౌన్ ను మ‌రింత క‌ఠినంగా అముల చేయాల‌ని కేంద్ర మంత్రి సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు కేంద్రం అన్ని ర‌కాలుగా అండ‌గా ఉంటుంద‌ని, అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో సీనియ‌ర్ అధికారుల‌ను పంపి సాయం అందిస్తామ‌ని చెప్పారు.