కాళ్లులేకున్నా నిలబడమన్నారు.. ఎయిర్ పోర్టులో యువతి ఆవేదన

కాళ్లులేకున్నా నిలబడమన్నారు.. ఎయిర్ పోర్టులో యువతి ఆవేదన

వికలాంగుల హక్కులపై పోరాడే ప్రచారకర్త, అమెరికాకు చెందిన 28ఏళ్ల వికలాంగ యువతి విరలి మోడీ.. తనకు అవమానం జరిగిందంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. వ్యక్తిగత పనిమీద ఢిల్లీనుంచి ముంబైకి వెళ్తుండగా… ఢిల్లీ ఎయిర్ పోర్టులో తనిఖీల పేరుతో CISF మహిళా అధికారి తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించారని అన్నారు.

వీల్ చెయిర్ లో ఉన్న తనను.. లేచి నిలబడాల్సిందిగా ఢిల్లీ ఎయిర్ పోర్టులోని CISFమహిళా అధికారి అడిగారని విరలి మోడీ చెప్పారు. తనతో పాటు ఉన్న మరో సహాయకురాలు, తాను ఎంత చెప్పినా వినకుండా.. ‘డ్రామాలు చేస్తున్నావా.. లేని నిల్చో’ అని గట్టిగా అడిగిందంటూ విరలి మోడీ ఆరోపించారు. అక్కడే ఉన్న మరో అధికారికి తనకు ఎదురైన ఇబ్బందికర అనుభవం గురించి బాధపడుతూ చెప్పుకున్నానని విరలి వివరించారు. ఐతే.. అదే సందర్భంలో.. తాను చెబుతున్నది అబద్దమంటూ ఆ మహిళా అధికారి బుకాయించిందని ఆమె చెప్పారు. వికలాంగురాలితో ప్రవర్తించే పద్ధతి ఇదేనా అంటూ.. CISF ఉన్నతాధికారులకు విరలి మోడీ ట్విట్టర్ లో వివరిస్తూ పోస్ట్ పెట్టారు.

ఈ పోస్టుపై CISF అధికారులు స్పందించినట్టు విరలి మోడీ చెప్పారు. జరిగిన సంఘటనకు బాధపడుతున్నామంటూ CISFఉన్నతాధికారి తనతో చెప్పారనీ.. ఢిల్లీలో ఉన్నప్పుడు ఏ సహాయమైనా చేస్తామన్నారని చెప్పారు. సదరు మహిళా CISF అధికారికి సాఫ్ట్ స్కిల్స్ చెప్పిస్తామన్నారు.

CISF అధికారులు క్షమాపణ చెప్పడం జరిగిన సమస్యకు పరిష్కారం కాదనీ… వికలాంగులతో సరిగా ప్రవర్తించాలని విరలి మోడీ కోరారు.

2006లో జరిగిన ఓ సంఘటనలో ఆమె వెన్నెముక దెబ్బతినడంతో.. నడవలేకపోతున్నారు విరలి మోడీ.

ముంబైలో గతేడాది కూడా విరలి మోడీ వార్తల్లోకి వచ్చారు. వీల్ చెయిర్ నుంచి ఇబ్బందికరంగా దించారంటూ ఎయిర్ పోర్టు అధికారులపై ఆమె కంప్లయింట్ చేయడంతో…సిబ్బంది ఆ సందర్భంలో క్షమాపణ చెప్పారు.