మహిళలు, పిల్లలతో వెపన్స్ రవాణా

మహిళలు, పిల్లలతో వెపన్స్ రవాణా
  •     టెర్రరిస్టులకు మెసేజ్​లు, డ్రగ్స్ చేరవేసేందుకు వాడుకుంటున్నరు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లోకి టెర్రరిస్టులను పంపుతూ నిరంతరం కుట్రలు చేస్తున్న పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కొత్త వ్యూహాలు పన్నుతోందని శ్రీనగర్​లోని చీనార్ కోర్ కమాండింగ్ ఆఫీసర్, లెఫ్టినెంట్ జనరల్ అమర్ దీప్ సింగ్ ఔజ్లా వెల్లడించారు. మహిళలను, అమ్మాయిలను, చిన్న పిల్లలను టెర్రర్ కార్యకలాపాలకు ఐఎస్ఐ వాడుకుంటోందని, వారి ద్వారా టెర్రరిస్టులకు మెసేజ్ లు పంపుతోందని తెలిపారు. కొన్నిసార్లు డ్రగ్స్, వెపన్స్ కూడా వారి ద్వారా చేరవేస్తోందని ఆయన ‘పీటీఐ’ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘గతంలో మాదిరిగా టెర్రరిస్టులతో కమ్యూనికేషన్స్​కు మొబైల్ ఫోన్లు వాడటంలేదు. 

మహిళలను, పిల్లలను సమాచారం చేరవేతకు వాడుకుంటూ ప్రమాదకరమైన ట్రెండ్​కు ఐఎస్ఐ ఎత్తుగడ వేసింది. అలాగే జమ్మూకాశ్మీర్​లోకి చొరబాట్లను కూడా నిరంతం ప్రోత్సహిస్తోంది” అని అమర్ దీప్ సింగ్ తెలిపారు. అయితే, కొన్నేండ్లుగా భద్రతా సంస్థలు కలిసికట్టుగా పని చేస్తుండటంతో కాశ్మీర్​లో హింసను అడ్డుకోగలిగామని, శాంతియుత వాతావరణం నెలకొందని ఆయన తెలిపారు. ‘సహీ రాస్తా(సరైన మార్గం)’ పేరుతో చేపట్టిన కార్యక్రమంతో కూడా స్థానికుల్లో గణనీయమైన మార్పు వస్తోందన్నారు. ఇటీవల ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా కాశ్మీర్ లో జీ20 సమావేశం కూడా నిర్వహించడమే ఇక్కడ శాంతికి నిదర్శనమని తెలిపారు.