హుస్నాబాద్, వెలుగు : మహిళా ఉద్యోగులు, బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన శ్రీబద్రి మహేశ్ హుస్నాబాద్ విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తన తోటి పనిచేసే మహిళా సిబ్బందితో పాటు బంధువులు వాట్సప్ స్టేటస్, సోషల్ మీడియాలో పెట్టే ఫొటోలను సేకరించి, ఫొటో ఎడిటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా అసభ్యకరంగా మార్ఫింగ్ చేసేవాడు.
రెండు రోజుల కింద అతడి వాట్సప్‌లో ఫొటోలను గమనించిన ఓ ఉద్యోగి ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ శాఖ డీఈ కృష్ణయ్య హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి ఎంక్వైరీ మొదలు పెట్టారు.
ఈ క్రమంలో మహేశ్ ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా.. వందల కొద్దీ ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. దీంతో ఆదివారం మహేశ్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ కొండ్ర శ్రీను, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి తెలిపారు. నిందితుడిని హుస్నాబాద్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా... 14 రోజుల రిమాండ్ విధించడంతో... సిద్దిపేట జైలుకు తరలించారు.
