పౌరుల ప్రైవసీతో ఆటలాడితే దేశం విడిచి పోవాల్సి వస్తది: వాట్సప్‎కు సుప్రీంకోర్టు వార్నింగ్

పౌరుల ప్రైవసీతో ఆటలాడితే దేశం విడిచి పోవాల్సి వస్తది: వాట్సప్‎కు సుప్రీంకోర్టు వార్నింగ్

న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్‎ఫామ్ వాట్సప్‎, దాని మాతృ సంస్థ మెటాపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డేటా షేరింగ్ ముసుగులో దేశ పౌరుల గోప్యతతో ఆటలాడితే దేశం విడిచి పోవాల్సి వస్తదని హెచ్చరించింది. పౌరుల గోప్యత హక్కు విషయంలో రాజీ పడనీయబోమని స్పష్టం చేసింది. ఈ దేశ ప్రజల గోప్యతతో ఆటలు ఆడుకునేందుకు అనుమతించబోమని తేల్చిచెప్పింది. వాట్సాప్ తమ మాతృసంస్థ అయిన మెటాతో యూజర్ల డేటాను షేర్ చేసునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వినియోగదారుల డేటాను వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది. 

2021లో వాట్సప్ న్యూ ప్రైవసీ రూల్‎ను తీసుకొచ్చింది. వాట్సప్ కొత్త గోప్యతా విధానాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పుబట్టింది. మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని ఉపయోగించి కొత్త గోప్యతా విధానాన్ని తప్పనిసరిగా అంగీకరించేలా వినియోగదారులను వాట్సాప్ ఒత్తిడి తీసుకువచ్చిందని సీసీఐ పేర్కొంది. వాట్సాప్ సేవలను కొనసాగించాలంటే మెటా ఇతర ప్లాట్‌ఫార్మ్‌లతో డేటా పంచుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని వినియోగదారులకు వాట్సప్ ఒత్తిడి చేసిందని.. ఇది చట్ట విరుద్ధమని సీసీఐ తేల్చింది. 

ఈ మేరకు 2024లో వాట్సప్‎కు 213 కోట్ల జరిమానా విధించింది. దీంతో సీసీఐ ఉత్తర్వులను వాట్సప్, మెటా సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఈ పిటిషన్లపై మంగళవారం (ఫిబ్రవరి 3) సీజేఐ సూర్యకాంత్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పౌరుల వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనల విషయంలో వాట్సాప్ తీరుపై సీజేఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాలో ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మిమ్మల్ని అనుమతించం. దేశ చట్టాలను పాటించడంలో విఫలమైతే వాట్సప్ ఇండియా విడిచి వెళ్ళే అవకాశం ఉంది’’ అని సీజేఐ హెచ్చరించారు. డేటా షేరింగ్ సాకుతో పౌరుల గోప్యత హక్కును రాజీ పడనీయబోమని.. వినియోగదారుల డేటాను వాణిజ్య ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయరాదని పేర్కొన్నారు. వాట్సాప్ మెటాతో యూజర్ల డేటాను షేర్ చేసునేందుకు వీల్లేదని స్పష్టం చేశారు.

డేటా షేరింగ్ ఉండదని హామీ ఇవ్వాలని.. లేదంటే ఈ కేసు కొట్టేస్తామని సీజేఐ హెచ్చరించారు. ఈ క్రమంలో వాట్సాప్ తరపు న్యాయవాది తమ గోప్యతా విధానం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉందని వాదించగా.. డేటా షేరింగ్ కేవలం మాతృ సంస్థకే పరిమితం అని మెటా కోర్టుకు తెలిపింది. టెక్ కంపెనీల వాదనలపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టెక్ కంపెనీలు గోప్యతా నిబంధనలు చాలా తెలివిగా రూపొందించబడ్డాయని, సాధారణ పౌరులు వాటిని పూర్తిగా అర్థం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. చాట్ ట్రెండ్‌ల ఆధారంగావినియోగదారు డేటాను ప్రవర్తనా, వాణిజ్యపరంగా దోపిడీ చేయడం వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తుందని నొక్కి చెప్పారు. అన్ని వర్గాల వాదనల తర్వాత 2026, ఫిబ్రవరి 9న ఈ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పటి వరకు మెటాతో ఎలాంటి యూజర్ సమాచారాన్ని పంచుకోవద్దని వాట్సాప్‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు.