V6 News

మన నిఘా డేటాబేస్‌‌ ప్రపంచంలోనే అతిపెద్దది

మన నిఘా డేటాబేస్‌‌ ప్రపంచంలోనే అతిపెద్దది

ఫేషియల్​ రికగ్నిషన్​ సిస్టం ఏర్పాటుకు ఇండియా రెడీ

రోజూ ఎక్కడో ఓ చోట పిల్లలు, మహిళలు మిస్సవుతూనే ఉన్నారు. మనుషుల అక్రమ రవాణా ముఠాలకు వాళ్లు బలైపోతున్నారు. వాళ్ల ఆచూకీ దొరకడం చాలా కష్టమైపోతోంది. బట్టల ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో బానిస బతుకులతో అల్లకల్లోలం అవుతున్నారు. బ్రోతల్​ హౌస్​లలో భారమైన జీవితం గడుపుతున్నారు. మరి, అలా బాధితులుగా మిగిలిపోతున్నవారిని గుర్తించి కాపాడడం ఎలా? సమాధానం ఒక్కటే.. ఫేషియల్​ రికగ్నిషన్​ సిస్టం. అంటే ఓ పెద్ద డేటాబేస్​లో జనం ఐడెంటిటీని దాచిపెట్టడం. ఇలాంటి డేటాబేస్​ వల్లే ఢిల్లీలో గత జులైలో బచ్​పన్​ బచావో ఆందోళన్​ అనే ఓ స్వచ్ఛంద సంస్థ, అక్కడి పోలీసులు ఏర్పాటు చేసుకున్న డేటాబేస్​తో 10,561 మంది పిల్లలను కాపాడగలిగింది. అందుకే ఇప్పుడు మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఫేషియల్​ రికగ్నిషన్​ డేటాబేస్​ను ఏర్పాటు చేయబోతోంది. మరి కొద్ది నెలల్లోనే అది అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే తెలంగాణ, ఏపీ, పంజాబ్​ వంటి రాష్ట్రాలు సొంతంగా ఇలాంటి డేటాబేస్​ను ఏర్పాటు చేసుకున్నాయి. పిల్లలు, మహిళలు కనిపించకుండా పోతే చాలా కొద్ది రోజుల్లోనే ఆ కేసులను ఛేదించగలుగుతున్నాయి.

నేషనల్​ డేటాబేస్​

ఇలాంటి డేటాబేస్‌ కొన్ని రాష్ట్రాల వరకే పరిమితం కాకుండా దేశం మొత్తం ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఈ డేటాబేస్​ ఏర్పాటు కోసం నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో (ఎన్​సీఆర్​బీ) 172 పేజీల నివేదిక తయారు చేసింది. డేటాబేస్​ ఏర్పాటు చేయడానికి కంపెనీల నుంచి బిడ్స్​ను పిలిచింది. అక్టోబర్​ 11 వరకు గడువిచ్చింది. ఇప్పటికే చాలా కంపెనీలు బిడ్స్​ వేశాయి. డేటాబేస్​లో నేరస్తుల ఫొటోలు, ఏజెన్సీలు సేకరించిన చిత్రాలు, ఊహా చిత్రాలు, సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఫొటోలను నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. నేరస్థులే కాదు, మిస్సింగ్​కు సంబంధించి లేదా ఏదైనా నేరానికి సంబంధించి ఫుటేజీలు, న్యూస్​ పేపర్లలో ప్రింట్​ అయిన వారి ఫొటోలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. పోలీసు అధికారులు సంఘటన స్థలంలోని క్లూస్​ ఆధారంగా మొబైల్​ ఫోన్​లో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక యాప్​తో ఫొటోలను విశ్లేషించేలా ఏర్పాట్లు చేస్తారు. దీని ద్వారా నేరస్థులను, మిస్సయిన వారిని, గుర్తుతెలియని మృతదేహాలను గుర్తుపట్టడం తేలిక అవుతుందని అధికారులు చెబుతున్నారు. నేరం జరిగిన తీరునూ తెలుసుకునే వీలు ఉంటుందని, తద్వారా కేసు పరిష్కారం త్వరగా జరుగుతుందని చెప్పారు.

80 కంపెనీలతో మీటింగ్​

ఎన్​సీఆర్​బీ పిలుపుతో కంపెనీలు బిడ్లు వేశాయిగానీ, ఎన్ని సంస్థలు వేశాయన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. బిడ్స్​ పిలవడానికి ముందు జులైలో దాదాపు 80 కంపెనీలతో ఎన్​సీఆర్​బీ మీటింగ్​ పెట్టింది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి మూడు ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీకే అవకాశం ఇస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో మన దేశానికి చెందిన చాలా కంపెనీలకు అవకాశం దక్కకుండా పోతుందని అంటున్నారు. ఐబీఎం, హెవ్లెట్​ పక్కార్డ్​ ఎంటర్​ప్రైజ్​, యాక్సెంచర్​ వంటి కంపెనీలు ఆసక్తి చూపించాయని తెలుస్తోంది. అయితే, విదేశీ కంపెనీలకు అవకాశమిస్తే గూఢచర్యానికి వాడుకునే ప్రమాదముందని కొందరు నిపుణులు, రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018లో జరిగిన ఓ ఒప్పందాన్ని గుర్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సగానికిపైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చైనాకు చెందిన హిక్​విజన్​ అనే కంపెనీకి ఇండియాకు చెందిన ప్రామా టెక్నాలజీస్​తో డీల్​ చేయించారని చెబుతున్నారు. రెండు కలిసి ప్రామా హిక్​విజన్​గా ఏర్పాటయ్యాయని, దాని వల్ల చైనా మన దేశంలో గూఢచర్యం చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రామా హిక్​విజన్​ సీఈవో మాత్రం ఆ ఆరోపణల్ని తోసిపుచ్చుతున్నారు. ఢిల్లీలో లక్షా 40 వేలకుపైగా సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది ఆ పని మొదలైందని చెప్పారు. ఒక్క ఢిల్లీలోనే కాకుండా గుజరాత్​లోని దీసా సిటీ, ముంబై వంటి పెద్ద పెద్ద సిటీల్లోనూ ఆ కంపెనీ సీసీటీవీలను ఏర్పాటు చేస్తోంది.

సవాళ్లు.. ప్రైవసీ సమస్యలు

ఎంపికైన కంపెనీ డేటాబేస్​ను 8 నెలల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద డేటాబేస్​ను ఏర్పాటు చేయగలుగుతుందా అని నిపుణులు అనుమానిస్తున్నారు. టెక్నాలజీ పరంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని అంటున్నారు. ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే కనీసం 12 నుంచి 18 నెలల టైం కావాల్సిందేనని చెబుతున్నారు. నిఘా కెమెరాలను, అందులోనూ ఫేషియల్​ రికగ్నిషన్​ కెమెరాల వంటి అత్యాధునిక టెక్నాలజీ డేటాబేస్​ను ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద సవాలేనని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా జనాల ప్రైవసీకి భంగం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం డేటా ప్రొటెక్షన్​ చట్టం లేదని, ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న కొత్త అతిపెద్ద ఫేషియల్​ రికగ్నిషన్​ సిస్టంకు ప్రత్యేకమైన చట్ట నిబంధనలు తయారు చేయలేదని నిపుణులు చెబుతున్నారు. సోషల్​ పోలీసింగ్​ (నిఘా పెట్టడం)కు ఇదో ఆయుధంలా మారే అవకాశముందని, సిల్లీ సిల్లీ కేసులకూ వాడుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. అంతేగాకుండా ఆధార్​కూ దానిని లింక్​ చేసే అవకాశమూ ఉంటుందంటున్నారు. 2017లో వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)పై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పర్సనల్​ డేటా ప్రొటెక్షన్​ ముసాయిదా బిల్లును పార్లమెంట్​లో ప్రవేశపెట్టినా ఆమోదానికి నోచుకోలేదు. ఆధార్​లో భాగంగా తీసుకున్న వేలి ముద్రలు, కంటి స్కాన్లు వ్యక్తిగత ప్రైవసీకి తూట్లు పొడిచేవేనని స్వచ్ఛంద కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

World's biggest face recognition system arrives in India next month