నీళ్లలో బోట్ లా .. గాలిలో విమానంలా..

నీళ్లలో బోట్ లా .. గాలిలో విమానంలా..

సముద్రంలో బోట్ లేదా షిప్‌‌ ట్రావెల్‌‌కు అయ్యే ఖర్చు తక్కువే.. కానీ ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. అదే ఫ్లైట్​లోనో, బుల్లెట్ ట్రైన్‌‌లోనో ప్రయాణిస్తే ఖర్చు పెరిగినా.. తక్కువ టైమ్​లోనే ప్రయాణం పూర్తవుతుంది. ఈ రెండింటిని కలిపి ఒకే దానిలో తీసుకొచ్చే ప్రయత్నమే సీ గ్లైడర్ అని రీజెంట్ కంపెనీ చెబుతోంది. స్పీడ్, కంఫర్ట్, విమానాల్లో ఉండే నావిగేషన్ సిస్టమ్‌‌తో పాటు బోట్‌‌ లెక్క తక్కువ ఖర్చుతో సీగ్లైడర్‌‌‌‌లో ప్రయాణం చేయొచ్చని కంపెనీ సీఈవో బిల్లీ థల్‌‌హీమర్ తెలిపారు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వెహికల్ అని, అయితే ఎలక్ట్రిక్ ప్లేన్‌‌తో పోలిస్తే సీగ్లైడర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ రెట్టింపు ఉందని వివరించారు.

భారీ రన్‌‌వేలు అక్కర్లేదు.

ఈ హైబ్రిడ్ క్రాఫ్ట్ కోసం ఫ్లైట్‌‌ మాదిరిగా భారీ ఎయిర్‌‌‌‌పోర్టులు వంటి నిర్మాణాలు చేపట్టాల్సిన పని లేదు. దీనికి భారీ రన్‌‌ వేతో అవసరం లేదు. సీపోర్టులు, హార్బర్లలో ఉండే డాకింగ్ ప్లాట్​ఫామ్స్ సరిపోతాయి. చిన్న ప్లాట్‌‌ ఫామ్‌‌ లాంటి డాక్‌‌ పైనుంచి ప్యాసింజర్లు దానిలోకి ఎక్కిన తర్వాత.. మొదట నీటిలో బోట్​లా ట్రావెల్ చేస్తుంది. గంటకు 72 కిలోమీటర్ల స్పీడ్‌‌తో వెళ్తుంది. ఆ తర్వాత విశాలంగా ఉన్న ఏరియాలోకి వెళ్లగానే టేకాఫ్ అవుతుంది. అయితే విమానాల్లా కిలోమీటర్ల ఎత్తులో ఎగరాల్సిన అవసరం కూడా లేదు. కేవలం పది మీటర్ల ఎత్తులోపే ఇవి ట్రావెల్ చేయగలుగుతాయని, దీని వల్ల ఎక్కువ ఎనర్జీ వాడుకోవాల్సిన​అవసరం ఉండదని రీజెంట్ కంపెనీ తెలిపింది. గాలిలోకి ఎగిరిన తర్వాత సుమారు గంటకు 300 కిలోమీటర్ల మ్యాగ్జిమం స్పీడ్‌‌కు చేరుకుంటుంది.

లాంగ్ డిస్టెన్స్‌‌కు కష్టమే..

ప్రస్తుతం ఉన్న బ్యాటరీ టెక్నాలజీ ప్రకారం ఈ సీగ్లైడర్‌‌‌‌ లాంగ్ జర్నీలకు పనికి రాదని రీజెంట్ కంపెనీ తెలిపింది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేసిన తర్వాత 300 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే వెళ్లగలుగుతుందని పేర్కొంది. అయితే బ్యాటరీ టెక్నాలజీ వేగంగా డెవలప్ అవుతోందని, 2050 నాటికి వచ్చే బ్యాటరీల సాయంతో సీగ్లైడర్స్ ఒక్కసారి రీచార్జ్‌‌ చేస్తే 800 కిలోమీటర్లకు పైగా ట్రావెల్ చేయగలుగుతాయని రీజెంట్ చెబుతోంది. మెజారిటీ దేశాల్లో వీటి సర్వీసులు మొదలుకావడానికి కూడా కనీసం మరో 15 నుంచి 20 ఏండ్లు పట్టే చాన్స్ ఉందని ఆ సంస్థ అంచనా వేస్తోంది.

వాతావరణం బాగోలేనప్పుడు..

సముద్రం ప్రశాంతంగా ఉండి, అలలు సాధారణంగా ఉన్న టైమ్‌‌లో సీగ్లైడర్ ట్రావెల్‌‌కు ఎటువంటి సమస్య లేదు. కానీ వాతావరణం బాగోలేనప్పుడు, సముద్రం అల్లకల్లోలంగా మారినప్పుడు వీటి ఆపరేషన్స్ పరిస్థితి ఏంటన్న దానిపై వేర్వేరు ప్రాంతాల్లో టెస్ట్‌‌ రన్స్ నిర్వహించబోతున్నామని రీజెంట్ కంపెనీ తెలిపింది. అన్ని సమయాల్లోనూ వీటిని వాడుకోవచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొంది.