- ‘బతుకు..బతకనివ్వు’ సూత్రం కొనసాగించాలని హితవు
- యూఎన్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచన
- ఇరాన్ పోర్టుల దిగ్బంధం ప్రమాదకర చర్య: చైనా
బీజింగ్: పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నాలుగు ప్రతిపాదనలు చేశారు. ఇరాన్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు పరస్పర గౌరవంతో మెలగాలని కోరారు. ఒక దేశ అంతర్గత విషయాల్లో మరో దేశం జోక్యం చేసుకోవద్దని సూచించారు. మంగళవారం ఆయన అబుదాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించి, శాంతిని నెలకొల్పడానికి జిన్‌పింగ్ నాలుగు కీలక ప్రతిపాదనలను ప్రపంచం ముందుంచారు. అందులో మొదటిది.. గల్ఫ్ దేశాల మధ్య పీస్ ఫుల్ కోయిక్సిస్టెన్స్(బతుకు~బతకనివ్వు) సూత్రం కొనసాగాలని, ఒక ఉమ్మడి భద్రతా వ్యవస్థను నిర్మించుకోవడానికి ఆయా దేశాలు పరస్పర సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కోరారు. ప్రతి దేశ జాతీయ సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను మరో దేశం తప్పకుండా గౌరవించాలని, ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని రెండో ప్రతిపాదనగా స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా అరాచకం నెలకొనకుండా ఉండాలంటే ఐక్యరాజ్యసమితి(యూఎన్) కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ వ్యవస్థను, నిబంధనలను ప్రతి దేశం కచ్చితంగా పాటించాలని మూడో ప్రపోజల్ గా పిలుపునిచ్చారు. చివరగా, ప్రాంతీయ భద్రతను అభివృద్ధితో అనుసంధానం చేయాలని, చైనా తన ఆధునికీకరణను పంచుకోవడం ద్వారా మిడిల్ ఈస్ట్ దేశాల పురోగతికి, స్థిరత్వానికి తోడ్పడుతుందని జిన్‌పింగ్ హామీ ఇచ్చారు. అమెరికా విధిస్తున్న దిగ్బంధాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రపంచం మళ్లీ ఆటవిక చట్టాల(ఎవరికి బలముంటే వారిదే రాజ్యం) వైపు వెళ్లకుండా చూడాలని కోరారు. శాంతి స్థాపనలో చైనా తనవంతు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
బ్లాకేడ్ మరింత ప్రమాదకరం
ఇరాన్ ఓడరేవులకు, తీరప్రాంతాలకు వెళ్లే నౌకల్ని అడ్డుకోవాలని అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని చైనా తప్పుపట్టింది. ఇరాన్ తీర ప్రాంతాలను అమెరికా నౌకాదళం దిగ్బంధించడాన్ని ప్రమాదకరమైన, బాధ్యతారాహిత్యమైన చర్యగా పేర్కొంది. ట్రంప్ నిర్ణయం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని హెచ్చరించింది. మంగళవారం చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మీడియాతో మాట్లాడారు. "అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాల వద్ద మోహరించింది. అక్కడి నుంచి చమురు ఎగుమతులు జరగకుండా.. అలాగే, ఇతర అవసరమైన వస్తువులు లోపలికి రాకుండా అమెరికా అడ్డుకుంటున్నది. ఈ లక్షిత దిగ్బంధనం ఇప్పటికే బలహీనంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత దెబ్బతీస్తుంది. శాంతి ఒప్పందానికి ముప్పు తెస్తుంది. సముద్ర మార్గాల్లో ప్రయాణించే నౌకల భద్రతను కూడా డేంజర్లో పడేస్తుంది. అమెరికా చేస్తున్న ఈ పని చాలా ప్రమాదకరం, బాధ్యతారాహిత్యం" అని పేర్కొన్నారు.

