వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీలో యువ వారసత్వం ఆసక్తి చూపుతోంది. రాజకీయంగా బలపడేందుకు, పార్టీలో పట్టు సాధించేందుకు బీజేపీ నేతల వారసులు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా బీజేపీ నేతల వారసులతోపాటు, యువనేతల హడావుడి కనిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ సీనియర్ నేతల వారసులు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నేతల వారసులు, మరికొందరు యువనేతలు తమతమ నియోజకవర్గాలపై దృష్టిపెడుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పోటీలో ఉన్నామంటూ సంకేతాలిస్తున్నారు. బీజేపీలో ఏ కార్యక్రమం జరిగినా నేతల వారసుల హడావుడి కనిపిస్తోంది. ఈమద్య జరిగిన ప్రజాసంగ్రామ యాత్ర సమయంలోనూ, హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీ నేతల వారసులు పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ కమలంపార్టీలో తమ భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకుంటున్నారు. ఇమేజ్ ను పెంచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కొడుకు.. వీరేందర్ గౌడ్ ప్రస్తుతం బీజేపీలో యాక్టివ్ గా ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తానన్నారు. మాజీ ఎంపీ.. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల ఇంచార్జ్ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవియాదవ్ లు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రం గౌడ్ బీజేపీ గ్రేటర్ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ రాజకీయంగా బల పడేందుకు, పార్టీలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పార్టీ టికెట్ పొంది బరిలో నిలిచే అవకాశం ఎవరికి వస్తుందన్న చర్చ బీజేపీలో జోరుగా జరుగుతోంది.
