గ్యాస్ కొరతతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సిలిండర్ ఉన్న వాళ్లు గ్యాస్ అయిపోతే ఏంటి పరిస్థితి పొదుపుగా వాడుకుంటున్న సందర్భం. ముందు జాగ్రత్తలో భాగంగా రైస్ తో పాటు కొన్ని వంటకాలను ఎలక్ట్రిక్ కుక్కర్, ఇండక్షన్స్ స్టవ్స్ వాడుకుంటున్నారు జనాలు. ఇలాంటి పరిస్థితుల్లో సంగారెడ్డి టౌన్ లో సిలిండర్ పేలడం కలకలం రేపింది.
2026 ఏప్రిల్ 12న సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సంగమేశ్, మల్లమ్మ, బిందు, చిన్న లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ పేలినపుడు ఒక బాంబు పేలినంత శబ్దం వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా పేలడంతో ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయని తెలిపారు. అదే విధంగా ఇంటి మీద ఉన్న నీళ్ల ట్యాంకులు కూలిపడ్డాయి. గోడలు కూలాయి. ఒక్కసారిగా వచ్చిన మంటలతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ వాడుతున్న క్రమంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు పోలీసులు. వంట పూర్తయ్యాక గ్యాస్ ఆపేయడంతో పాటు.. గ్యాస్ సరఫారా కూడా ఆపేయాల్సిందిగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్యాస్ సేవ్ చేసుకోవాలని.. అందుకోసం లో ఫ్లేమ్ లోనే వంటలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఫ్రైలకు దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారు.
