మేడిపల్లిలో ఉరేసుకొని బాలిక.. పెట్రోల్ పోసుకొని యువకుడు ఒకరోజు తేడాతో ప్రేమ జంట సూసైడ్

మేడిపల్లిలో ఉరేసుకొని బాలిక.. పెట్రోల్ పోసుకొని యువకుడు  ఒకరోజు తేడాతో ప్రేమ జంట సూసైడ్
  • రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో విషాదం

ఎల్బీ నగర్, వెలుగు: తాను ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేక ప్రియుడు కూడా పెట్రోల్   పోసుకుని తనువు చాలించాడు. హైదరాబాద్​ శివారు రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన సిద్దగోని మహేశ్ (21), అదే గ్రామానికి చెందిన అతని బంధువు పూజ (17) ప్రేమించుకున్నారు. పెండ్లి చేసుకుందామని అనుకున్నారు. అయితే, మహేశ్  తన ఇంట్లో మూడో కొడుకు. అతని ఇద్దరు అన్నలకూ ఇంకా పెండ్లి కాలేదు. 

యువతి కూడా మైనర్. ఇంటర్  చదవుతుండడంతో వారి పెండ్లికి ఇరు కుటుంబ పెద్దలు కూడా అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ కొద్ది రోజుల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత కొద్ది రోజుల పాటు దూరంగా ఉన్నారు. సోమవారం పూజకు మహేశ్​ ఫోన్ చేసి పెండ్లి చేసుకుందామని అడిగాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ విషయాన్ని పూజ తన తల్లికి చెప్పింది. 

అంతలోనే మరుసటిరోజు మంగళవారం ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో దూలానికి పూజ ఉరేసుకొని చనిపోయింది. ప్రియురాలి మరణం తట్టుకోలేక బుధవారం ఉదయం అబ్దుల్లాపూర్​మెట్  మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో మహేశ్  తన ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహేశ్  తండ్రి సిద్దగోని యాదయ్య హయత్ నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పూజ ఆత్మహత్య విషయంలో మంగళవారం మహేశ్ పై వేధింపుల కేసు నమోదైంది.