న్యూఢిల్లీ / ఇంఫాల్: మణిపూర్‌లో ఫిబ్రవరి 13తో రాష్ట్రపతి పాలన ముగుస్తుండడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్కడ అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీ.. తమ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎమ్మెల్యే యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్‌ను మంగళవారం ఎంపిక చేసింది. మణిపూర్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో బీజేపీ అధిష్టానం న్యూఢిల్లీలో సమావేశం నిర్వహించింది. దీనికి బీజేపీ కేంద్ర పరిశీలకుడిగా ఉన్న తరుణ్ చుగ్, ఈశాన్య భారత బీజేపీ ఇన్‌చార్జ్ సంబిత్ పాత్ర హాజరయ్యారు.
ఫిబ్రవరి 2025లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చినప్పటి నుంచి మణిపూర్ శాసనసభ సస్పెండెడ్ యానిమేషన్ స్థితిలో ఉంది. 60 మంది సభ్యులున్న మణిపూర్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 32 స్థానాలు గెలుచుకోగా, ఆ తర్వాత జేడీయూ నుంచి ఎన్నికైన ఆరుగురిలో ఐదుగురు బీజేపీలో చేరారు. నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి ఆరుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు చెందిన ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, కుకీ పీపుల్స్ అలయన్స్ రెండు, జనతాదళ్ (యునైటెడ్) ఒక స్థానం, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది.
