వరల్డ్ కప్ లో రాయుడిని పక్కన పెట్టడమే తప్పు

వరల్డ్ కప్ లో రాయుడిని పక్కన పెట్టడమే తప్పు
  • సరైన ప్లానింగ్‌‌ లేకే వరల్డ్‌‌కప్‌‌లో ఇండియా ఓడింది

న్యూ ఢిల్లీ:  అంబటి రాయుడును పక్కనపెట్టడం, అనుభవం లేని విజయ్‌‌శంకర్‌‌, రిషబ్‌‌పంత్‌‌ను నమ్మడం లాంటి  తప్పుడు నిర్ణయాల వల్లే  ఇండియా  వన్డే వరల్డ్‌‌కప్‌‌ గెలవలేకపోయిందని మాజీ క్రికెటర్‌‌ యువరాజ్‌‌ సింగ్‌‌ అన్నాడు. ‘వరల్డ్‌‌కప్‌‌కు రాయుడును పక్కనపెట్టడం చాలా నిరాశకలిగించింది. నాలుగో నంబర్‌‌లో రాయుడు దాదాపు ఏడాది పాటు బాగా ఆడాడు. మెగా టోర్నీకి వచ్చేసరికి అంబటిని కాదని విజయ్‌‌శంకర్‌‌, రిషబ్‌‌ పంత్‌‌కు చాన్సిచ్చారు. అసలు మేనేజ్‌‌మెంట్‌‌ ఆలోచనే అర్థం కాలేదు. టోర్నీ అంతా బెంచ్‌‌కు పరిమితమైన దినేశ్‌‌ కార్తీక్‌‌ను సడన్‌‌గా సెమీస్‌‌లో ఆడించారు. ధోనీని ఏడో స్థానంలో బ్యాటింగ్‌‌కు పంపారు. లైనప్‌‌లో చాలా గందరగోళం సృష్టించారు. పెద్ద మ్యాచ్‌‌ల్లో ఇలాంటి తప్పులు చేయకూడదు. రోహిత్‌‌, కోహ్లీ ఫామ్‌‌లో ఉన్నారు మిగిలినోళ్లు ఎలా ఉన్నా పర్లేదు అన్నట్లు కనిపించింది వాళ్ల తీరు. కానీ ఒక్కరిద్దరిపై ఆధారపడి ఏ జట్లు విజయాలు సాధించలేవు. హ్యాట్రిక్‌‌ వరల్డ్‌‌కప్‌‌లు గెలిచిన ఆసీస్‌‌ను చూస్తే మనోళ్లు ఎక్కడ తప్పు చేశారో అర్థమవుతుంది’ అని యువీ అభిప్రాయపడ్డాడు. అయితే వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌‌ టీ20 ప్రారంభానికి  నాలుగు నెలల ముందుగానే జట్టును ప్రకటించాలని సూచించాడు. అలా చేస్తే ప్లేయర్లకు తమ రోల్‌‌పై క్లారిటీ ఉంటుందన్నాడు.