ముంబై: టీమిండియా యంగ్ ఓపెనర్ పృథ్వీ షా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో విఫలమయ్యాడు. దీంతో అతడ్ని ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చెయ్యలేదు. అయితే దేశవాళీ క్రికెట్‌లో వరుసగా సెంచరీలు బాదుతున్న షా.. మళ్లీ టీమిండియాలోకి వచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీలతో దుమ్మురేపుతున్న షా.. ముంబైని ఫైనల్‌కు చేర్చాడు. ఈ ఒక్క సీజన్‌లో 188.5 స్ట్రయిక్ రేట్‌తో 754 రన్స్ చేసి మంచి ఊపు మీదున్నాడు. టెస్ట్ టీమ్‌లో నుంచి తనను తొలగిండంపై షా స్పందించాడు. ఆసీస్‌లో విఫలమవ్వడం తనను కుంగదీసిందన్నాడు. ఈ గ్యాప్‌లో టెక్నిక్, స్కిల్స్‌ను మెరుగుపర్చుకొని తిరిగి రిథమ్‌ను అందుకున్నానని చెప్పాడు.
‘ఆసీస్ సిరీస్‌లో వైఫల్యం తర్వాత సచిన్ టెండూల్కర్‌ను కలిశా. నా ఆటలో ఎక్కువ మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. సాధ్యమైనంతగా బంతి శరీరానికి దగ్గరగా ఉండేలా బ్యాటింగ్ చేయాలని చెప్పారు. నేను బంతి వస్తున్నప్పుడు ఆలస్యంగా స్పందించేవాడ్ని. ఆసీస్ టూర్‌లో దీని పైనే ఎక్కువగా పని చేశా. నేను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా. నేను గల్లీ ఏరియాలో ఎక్కువగా పరుగులు చేసేవాడ్ని. కానీ అదే ఏరియాలో ఔట్ అవుతున్నా. ఇప్పుడు దీన్ని పరిష్కరించుకున్నా’ అని షా పేర్కొన్నాడు.

