కీసర, వెలుగు: కీసర పీఎస్పరిధిలో పాత, నకిలీ స్థిరాస్తి పత్రాలతో బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయల రుణాలు పొందిన ఘరానా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని, 1983 నుంచి 2017 మధ్య కాలానికి చెందిన రిజిస్ట్రేషన్ లేని ప్లాట్లకు పాత పత్రాలు సృష్టించడమే వీరి పని. అనంతరం అసలు యజమానుల పేర్లతో నకిలీ సేల్ డీడ్‌లు, జీపీఏలు తయారు చేసి పిరామిల్, కేన్ ఫిన్ బ్యాంకులను మోసం చేశారు. ఈ కేసులో ఏ1 వల్లభనేని శ్రీనివాసరావు ప్రధాన సూత్రధారి.
బ్యాంకు రుణాలు ఇప్పించే అనుభవంతో 2017 నుంచి ఈ మోసాలకు పాల్పడుతున్నాడు. మొత్తం 30 మంది ఉన్న ఈ ముఠా ఇప్పటివరకు రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు మోసం చేయగా, తాజాగా రూ.4.11 కోట్ల కుంభకోణంలో శ్రీనివాసరావు, బ్యాంకుల ఏజెంట్లు శ్రీశైలం, దినేశ్ లతోపాటు వేణుగోపాల్, బుర్ర మహేశ్ యాదవ్, గున్నబోయిన మంజుల, కైరంకొండ నాగరాజు, దేవనాక భరత్ ను శుక్రవారం అరెస్ట్‌చేసినట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. త్వరలోనే సబ్‌రిజిస్ట్రార్ రహమాన్‌ను కూడా అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.
