గచ్చిబౌలి: చెంబులో తాళం పెట్టడమే కొంప ముంచింది.. ఇదే అదునుగా దోచుకెళ్లిన నేపాలీ దంపతులు

గచ్చిబౌలి: చెంబులో తాళం పెట్టడమే కొంప ముంచింది.. ఇదే అదునుగా దోచుకెళ్లిన నేపాలీ దంపతులు
  •     లాకర్ కీ దాయడంలో వ్యాపారవేత్త నిర్లక్ష్యం  
  •     ఇదే అదునుగా దోచుకెళ్లిన నేపాలీ దంపతులు 
  •     ముగ్గురు అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
  •     వివరాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ 

గచ్చిబౌలి, వెలుగు:  గచ్చిబౌలిలో ఇటీవల జరిగిన భారీ చోరీ కేసులో యజమాని నిర్లక్ష్యం ఆ ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులకు వరంగా మారింది. బంగారం, వెండి, నగదు దాచుకునేందుకు పటిష్టమైన లాకర్ ఏర్పాటు చేసుకున్న వ్యాపారవేత్త.. దాని తాళం చెవిని మాత్రం అక్కడే ఉన్న కలశం చెంబులో దాచి పెట్టడంతో నేపాలీ దంపతులు బంగారం, వెండి ఆభరణాలు, నగదుతో పరారయ్యారు. ఈ కేసులో గచ్చిబౌలి పోలీసులు ముగ్గురిని యూపీలో అరెస్ట్ చేసి బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. వివరాలను గురువారం శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తో కలిసి సైబరాబాద్ సీపీ రమేశ్ వెల్లడించారు. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ కమ్యూనిటీలోని విల్లా నెంబర్​73లో ప్రకాశ్ పాయ్(73) కుటుంబంతో ఉంటున్నాడు. 

కాగా, నేపాల్ కి చెందిన సురేశ్ వ్యాపారవేత్త ప్రకాశ్ పాయ్ ఇంట్లో పనుల కోసం 20 రోజుల క్రితం నేపాలీ కి చెందిన విమలా షాహీ, కమల్ షాహీ అనే భార్య, భర్తలను పనిలో పెట్టాడు. వీరు ఇంటి పనులు చేస్తూ అక్కడే ఉన్న సర్వెంట్ గదిలో నివాసం ఉంటున్నారు. విల్లాలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గదిలో రెండు లాకర్లున్నాయి. వాటి తాళం చెవిని ప్రకాశ్ ఎప్పుడూ లాకర్ పైన ఉన్న చెంబులో పెడతాడు. ఢిల్లీలో బంధువుల ఇంట్లో వేడుకకు భార్య వందన, కొడుకు అభిజిత్ తో కలిసి 6న వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ తాళం చెవిని చెంబులో పెట్టి పోయాడు. దీంతో కమల్ షాహీ తన భార్య విమలా షాహీ..సురేష్ కి సమాచారం ఇచ్చారు. దీంతో సురేశ్​దంపతులతో కలిసి చోరీకి ప్లాన్​వేశాడు. బాల్కనీ గ్లాస్ పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి లాకర్ పైన ఉన్న వినాయకుడి ఫొటోకు ఉన్న 4 తులాల బంగారు గొలుసు చోరీ చేశారు. 

తర్వాత చెంబులో నుంచి లాకర్​తాళం తీసి రూ. 5 కోట్ల విలువైన 5 కిలోల బంగారు ఆభరణాలు, వజ్రాల ఆభరణాలను దొంగిలించారు. సురేష్ విల్లా బయట ఉండగా, పక్కనే ఉన్న విల్లా వారు సెక్యూరిటీ కి సమాచారం ఇవ్వడంతో పట్టుకున్నారు. దొంగతనం చేసిన కమల్ సాహి,  విమల సాహి ఇద్దరు అక్కడి నుండి పారిపోయారు.  ప్రకాశ్ పాయ్ 7న రాగా, అసలు విషయం తెలిసింది. నిందితుల కోసం ఆరు స్పెషల్​టీమ్స్​ను ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి డీఐ నరేశ్ టీమ్​యూపీలోని బిలాస్​పూర్​రోడ్డులో కమల్ సాహి, విమల సాహిలతో పాటు  విమల చెల్లెలు కల్పనను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలోఉన్నారని చెప్పారు. శేరిలింగంపల్లి ఏ డీసీపీ ఉదయ్ రెడ్డి, నార్సింగి ఏసీపీ కళింగ రావు, గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్​బాలరాజు, డీఐ నరేశ్ పాల్గొన్నారు.