యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ తహసీల్దార్ మీరాబాయికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చౌటుప్పల్ మండలం తూప్రాన్పేటలోని సర్వే నెంబర్లు 13, 14 లోని 5.5 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంది. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఇందులో భాగంగా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లగా ఈడీ కేసుల కారణంగా నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయబోమని రిజిస్ట్రార్ చెప్పినట్టు తెలిసింది.
ఈ భూమిపై నిషేధం లేదని తమకు తహసీల్దార్ ఆఫీస్ నుంచి సమాచారం ఉందని, మీరు ఎందుకు చేయడం లేదంటూ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వ్యక్తులు గొడవకు దిగినట్టుగా సమాచారం. ఈ పరిణామంతో రూ. కోట్ల విలువైన 5.5 ఎకరాల భూమి విషయాన్ని రిజిస్ట్రార్ సీసీఎల్ఏకు సమాచారం అందించారు. అక్కడి నుంచి జిల్లాలోని హయ్యర్ ఆఫీసర్లకు ఆదేశాలు రావడంతో తహసీల్దార్ మీరాబాయికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 22 ఏ (1) (ఇ)లో ఈ భూమి వివరాలు ఎందుకు చేర్చలేదని నోటీసుల్లో పేర్కొన్నట్టుగా సమాచారం.
