- రాష్ట్రంలో పలుచోట్ల జోరు వాన
- ఇయ్యాల 18 జిల్లాలకు రెడ్ అలర్ట్
- రేపు 8 జిల్లాల్లోనూ అదే పరిస్థితి
- 4 రోజులు భారీ, అతి భారీ వర్షాలు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా సికింద్రాబాద్, బేగంపేట్, అమీర్‌పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమై నగరజీవనం స్తంభించిపోయింది. అత్యధికంగా విఠల్‌వాడిలో 3.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదర్‌నగర్‌లో 2.9 సెంటీమీటర్లు, కూకట్పల్లి బాలాజీనగర్‌లో 2.6, బన్సీలాల్‌పేటలో 2.5, తుర్కయంజాల్‌లో 2.4, మోతీనగర్‌లో 2.3, హిమాయత్‌నగర్‌లో 2.2, రహ్మత్‌నగర్‌లో 2.2, మలక్‌పేటలో 2.1, మంగళపల్లిలో 2, పాటిగడ్డలో 2, విద్యానగర్‌లో 2 సెంటీమీటర్లచొప్పున వర్షం పడింది. దీంతో ఆఫీసులు ముగించుకుని ఇండ్లకు బయలుదేరిన ఉద్యోగులు, వాహనదారులు భారీ వర్షం, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఐటీ కారిడార్‌తో పాటు ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, హుస్సేన్సాగర్పరిసరాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. నానల్ నగర్ నుంచి షేక్‌పేట్‌నాలా వరకు తీవ్ర ట్రాఫిక్జామ్ఏర్పడింది. ఇక్కడ రోజూ తీవ్రమైన ట్రాఫిక్సమస్య ఉంటుంది. ఇప్పుడు వర్షంతో పాటు గణనాథులు నిమజ్జనానికి వెళ్లడంతో సుమారు గంట పాటు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వినాయక నిమజ్జనోత్సవాల కోసం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు చేరుకున్న భక్తులు ఆకస్మిక వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, కొంతమంది వర్షంలోనే ఉత్సాహంగా గడిపారు. వర్షాలతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు, హైడ్రా సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆయా ప్రాంతాలు నీట మునిగిన చోట ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. మరో రెండు రోజులు ఇలాగే వర్షాలు పడొచ్చని.. ప్రజలు అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని హెచ్చరించారు
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు
ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా మినహా అన్ని జిల్లాల్లోనూ వాయుగుండం ప్రభావం కనిపిస్తున్నది. మంగళవారం వికారాబాద్ జిల్లా నాగారంలో అత్యధికంగా 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో 5.1 సెంటీమీటర్లు, పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లిలో 4.3, నాగర్‌కర్నూల్ జిల్లా కొండనాగులలో 3.9, ఆదిలాబాద్ జిల్లా హీరాపూర్‌లో 3.1, నిర్మల్ జిల్లా లోకేశ్వరంలో 3, రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 3, నల్గొండ జిల్లా పోలేపల్లిలో 2.6, దామరచర్లలో 2.6, నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలో 2.5, నిజామాబాద్ జిల్లా తొండకూరులో 2.5, సంగారెడ్డి జిల్లా మల్చెల్మలో 2.5, నిజామాబాద్ జిల్లా ఎర్గట్లలో 2.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
నాలుగు రోజులపాటు..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బుధవారం18 జిల్లాలకు (పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం 8 జిల్లాలకు (కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది. శుక్రవారానికిగాను ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. శనివారానికి ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్.. మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం ఉందని, బుధవారం ఉదయానికి ఇది తీవ్రవాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ వెల్లడించింది. దాని ప్రభావంతోనే రాష్ట్రంలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
జూరాలకు వరద2,300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో గద్వాల, వెలుగు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం స్వల్పంగా వరద ప్రారంభమైంది. ప్రాజెక్టుకు 2,300 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా నమోదు అయ్యింది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 318.21 మీటర్ల నీరు నిల్వ ఉన్నది. జూరాల ఆయకట్టు కింద పంట కాల్వలకు నీటిని విడుదల చేయాలని ఐదు రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జూరాలకు స్వల్పంగా వరద రావడం నీటి విడుదలకు కొంత మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
