సిద్దిపేట రూరల్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, జలసిరి పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత లబ్దిదారుల గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి దస్త్రాలను కలెక్టరేట్‌కు పంపాలని, నిర్మాణంలో ఉన్న గృహాలను త్వరగా పూర్తి చేయించి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని సూచించారు.
జలసిరి పనుల్లో భాగంగా ఫామ్ పాండ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్దేశిత టార్గెట్ ప్రకారం ప్రభుత్వ స్థలాలు, పల్లె ప్రకృతి వనాలలో వీటిని చేపట్టాలని ఆదేశించారు. చేయూత పింఛన్ల దరఖాస్తుల ఫీల్డ్ స్థాయి పరిశీలనను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ రమేశ్, గృహనిర్మాణ శాఖ అధికారి భగవంత్ రావు, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
