తమ్ముడి మోసం.. అక్క మిస్సింగ్

తమ్ముడి మోసం.. అక్క మిస్సింగ్
  • రూ. 26 లక్షల అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపం

మేడిపల్లి, వెలుగు: తమ్ముడికి ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆవేదనతో లేఖ రాసి అదృశ్యమైంది. బోడుప్పల్ వెస్ట్ బాలాజీ హిల్స్​కు చెందిన లావణ్య, ప్రసాద్​కు 16 ఏండ్ల కింద పెండ్లి జరిగింది. తన తమ్ముడు స్వామి వ్యక్తిగత అవసరాల కోసం లావణ్య ఇతరుల వద్ద అప్పులు చేసి మరీ రూ. 26 లక్షలు ఇచ్చింది. అయితే, ఎంత కాలమైనా ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ నెల 4న పుట్టింటికి వెళ్లి అడిగినా వారు నిరాకరించడంతో మరింత మనస్తాపం చెందింది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆమె భర్త ప్రసాద్ డ్యూటీ నుంచి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండటంతోపాటు తమ్ముడి వల్ల కలిగిన ఆర్థిక ఇబ్బందుల గురించి రాసిన లేఖ లభించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.