హైదరాబాద్ కార్ ఓనర్స్కు అలర్ట్.. హైబీమ్ లైట్ల విషయంలో కొత్త రూల్స్.. బ్రేక్ చేస్తే కఠిన చర్యలు

హైదరాబాద్ కార్ ఓనర్స్కు అలర్ట్.. హైబీమ్ లైట్ల విషయంలో కొత్త రూల్స్.. బ్రేక్ చేస్తే కఠిన చర్యలు

వాహనాలలో హైబీమ్ లైట్లు వచ్చిన తర్వాత ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. LED, HID లైట్ల కారణంగా ఎదురుగా వచ్చే వాహనం, రోడ్డు కనిపించని పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో రాత్రివేళల్లో హై-బీమ్ LED లైట్ల సమస్య తీవ్రంగా మారుతుండటంతో చర్యలకు ఉపక్రమించారు పోలీసులు. హైబీమ్ లైట్ల విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చామని.. తప్పనిసరిగా పాటించాల్సిందేనని మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

సోమవారం (ఏప్రిల్ 06) మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ కారిడార్ లోని గచ్చిబౌలి, మాదాపూర్ తో పాటు కోఠి, నాంపల్లి వంటి ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఎదురుగా వచ్చే వాహనాల హై-బీమ్ లైట్ల వల్ల క్షణాల్లో చూపు తగ్గిపోవడంతో, ఎదురుగా వస్తున్న వాహనాలు స్పష్టంగా కనబడక ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు. అధిక ప్రకాశం ఉన్న LED, HID లైట్లు, అలాగే అనధికార మార్పులు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని అన్నారు.

నగరాల్లో లో-బీమ్ వాడాల్సిన చోట కూడా చాలామంది హై-బీమ్‌లోనే డ్రైవ్ చేయడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చుతోందని ఏసీపీ తెలిపారు. హై భీమ్ లైటింగ్ సమస్యపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తూ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు.

నిపుణుల సూచన ప్రకారం, హై-బీమ్‌ను హైవేలు లేదా పూర్తిగా చీకటి రోడ్లలో మాత్రమే ఉపయోగించాలని అన్నారు. నగరాల్లో వాహనదారులు తప్పనిసరిగా లో-బీమ్‌ను ఉపయోగించాలని చెప్పారు. రాత్రివేళల్లో డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని పిలుపునిచ్చారు.