మధ్యతరగతి ప్రజల వంటిల్లే ఒక యుద్ధరంగం అయితే.. అక్కడ ధరల యుద్ధం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ విడుదల చేసిన ‘రోటీ రైస్ రేట్’ నివేదిక ప్రకారం.. మార్చి నెలలో వంటింటి బడ్జెట్‌లో కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. శాకాహారుల ఖర్చులో పెద్దగా మార్పు కనిపించలేదు. అయితే మాంసాహారులకు మాత్రం శుభవార్త ఉంది. వెజ్ థాలీతో పోలిస్తే నాన్ వెజ్ థాలీ ధర ఈసారి స్వల్పంగా తగ్గింది. గత ఏడాదితో పోలిస్తే నాన్ వెజ్ భోజనం తయారీ ఖర్చు 2 శాతం తగ్గగా, వెజ్ థాలీ ఖర్చులో పెద్దగా వ్యత్యాసం కనిపించలేదంటోంది రిపోర్ట్. అంటే కూరగాయల ధరలు అదుపులో ఉన్నప్పటికీ, ఇతర ఖర్చులు పెరగడం వల్ల శాకాహారులకు ఖర్చుల్లో ఆశించినంత ఊరట లభించలేదు.
నాన్ వెజ్ థాలీ ధరలు తగ్గడానికి ప్రధాన కారణం చికెన్ ధరల్లో వచ్చిన మార్పులే. నాన్ వెజ్ భోజనం ఖర్చులో దాదాపు సగం వాటా ఉండే బ్రాయిలర్ కోడి మాంసం ధరలు.. గత ఏడాదితో పోలిస్తే 2 శాతం తగ్గాయి. దీనికి తోడు మార్చి నెలలో నవరాత్రి ఉత్సవాలు రావడంతో చాలామంది మాంసాహారానికి దూరంగా ఉన్నారు. డిమాండ్ తగ్గడంతో మార్కెట్లో చికెన్ ధరలు దిగివచ్చాయి. ఫలితంగా మాంసాహార ప్రియుల జేబుపై భారం తగ్గింది. ఫిబ్రవరి నెలతో పోల్చి చూసినా నాన్ వెజ్ థాలీ ధరలు 1 శాతం మేర తగ్గి ఊరటనిచ్చాయి.
ఇక శాకాహార వంటకాల విషయానికి వస్తే.. ఉల్లిపాయలు ఏకంగా 25 శాతం, బంగాళదుంపలు 13 శాతం, పప్పు ధాన్యాలు 6 శాతం మేర తగ్గాయి. సరఫరా పెరగడం, ఎగుమతులు తగ్గడం వల్ల ఈ నిత్యావసరాలు మధ్యతరగతికి భారీ ఊరటనిచ్చాయి. ఈ ఆనందాన్ని టమోటాలు ఆవిరి చేసేశాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పంట చేతికి రావడంలో ఆలస్యం కావడంతో టమోటా ధరలు గత ఏడాదితో పోలిస్తే 33 శాతం పెరిగి కిలో రూ.28కి చేరాయి. దీనికి తోడు వంటనూనె ధరలు 6 శాతం, ఎల్‌పీజీ సిలిండర్ ధరలు 14 శాతం పెరగడం వల్ల వెజ్ థాలీ ఖర్చు తగ్గకుండా స్థిరంగా ఉండిపోయింది.
మొత్తానికి చూస్తే కిచెన్ బడ్జెట్ మిశ్రమంగా ఉంది. ఒకవైపు ఉల్లి, పప్పులు ఊరటనిస్తుంటే.. మరోవైపు టమోటా, వంటనూనె, గ్యాస్ మంట పుట్టిస్తున్నాయి. వెజ్ థాలీ ధరలు తగ్గకపోవడానికి ఈ అదనపు ఖర్చులే అడ్డుగోడగా మారాయి. అందుకే ఈ మార్చి నెలలో శాఖాహార భోజనం కంటే.. మాంసాహార భోజనమే కాస్త తక్కువ భారంగా ఉంది. చూస్తుంటే ప్రజల కిరాణా బిల్లులో మార్పులు పెద్దగా లేవని అనుకోవచ్చు కానీ.. లోతుగా విశ్లేషిస్తే మాత్రం ఐటమ్స్ రేట్లలో భారీ మార్పులే జరిగాయి.
