హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టైం తో సంబంధం లేకుండా ప్రతి ఏరియాలో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్ ఉంటోంది. ఇక హైటెక్ సిటీ గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా పీక్ అవర్స్ లో అటువైపు వెళ్లాలంటేనే భయపడేలా తయారయ్యింది పరిస్థితి. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ తో ఆఫీసుకు వెళ్లాలంటే నరకం చూస్తున్నామని అని అంటున్నారు ఐటీ ఎంప్లాయిస్. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు సైబరాబాద్ ట్రాఫిక్ అడ్మిన్ డీసీపీ రంజన్ రతన్ కుమార్. సింగిల్ రైడర్ వాహనాలు పెరగడమే ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెరగడానికి ప్రధాన కారణమని అన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతోందని..సైబరాబాద్ కమిషనర్ రమేష్ ఆదేశాలతో ప్రత్యేక సర్వే నిర్వహించామని తెలిపారు డీసీపీ రతన్ కుమార్. మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు గ్రౌండ్ లెవల్ స్టడీలో... సైబర్ టవర్స్ పరిసరాల్లో మార్నింగ్ పీక్ అవర్ సమయంలో సర్వే నిర్వహించామని.. సింగిల్ రైడర్ ప్రయాణాలతో ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ రద్ధి పెరుగుతుందని గుర్తించామని తెలిపారు. సర్వే నిర్వహించిన ఒక గంటలోనే మొత్తం వాహనాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయని తెలిపారు.
సర్వే సమయంలో గుర్తించిన వాహనాలు ఇలా:
- సింగిల్ రైడర్లు 10,138 మంది
- డబుల్ రైడర్లు 3,584 మంది
- సింగిల్ రైడర్లు డబుల్ రైడర్ల కంటే 6,554 ఎక్కువ..
ఒక్కరే వాహనంలో ప్రయాణించడం వల్ల వాహనాల సంఖ్య పెరుగుతోందని..ఫలితంగా భారీ ట్రాఫిక్ జామ్‌లతో పాటు సమయం వృథా, అదనపు ఇంధన ఖర్చు, ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు. రైడ్ షేరింగ్‌ను ప్రోత్సహించాలని.. సహోద్యోగులతో కార్ పూలింగ్ తో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం పెంచాలని అన్నారు డీసీపీ రతన్ కుమార్.
ALSO READ : కోటి 40 లక్షల మంది చావటానికి సిద్ధంగా ఉన్నారు
పీక్ అవర్స్‌లో వ్యక్తిగత వాహనాలు తగ్గించడంతో పాటు స్కూల్, కాలేజీ రద్దీ సమయాలలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న మార్పులతో ట్రాఫిక్ సమస్యకు పెద్ద పరిష్కారం సాధ్యమని..ఐటీ ఉద్యోగులు, ప్రజలు సహకరిస్తే ట్రాఫిక్ ఫ్రీ సైబరాబాద్ సాధ్యమేనని స్పష్టం చేశారు. సింగల్ రైడర్ ప్రయాణం ఈ ధోరణి మారాల్సిన అవసరముందని సూచించారు.
