కోటి 40 లక్షల మంది చావటానికి సిద్ధంగా ఉన్నారు: అమెరికాతో తాడోపేడో ఇప్పుడే తేల్చేస్తామంటున్న ఇరాన్

 కోటి 40 లక్షల మంది చావటానికి సిద్ధంగా ఉన్నారు: అమెరికాతో తాడోపేడో ఇప్పుడే తేల్చేస్తామంటున్న ఇరాన్

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో తాడోపేడో తేల్చుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ నాయకత్వం నుంచి సంకేతాలు రావటంతో పర్షియన్ గల్ఫ్ యుద్ధం మరింతగా ముదురుతోంది. ఎవరు ఏం చెప్పింది.. ఏం చేసినా తాము వెనక్కి తగ్గేదేలేదని, తమకు పూర్తి పరిష్కారంతో పాటు పరిహారం, హామీలను కూడా ఇస్తేనే శాంతి చర్చలు అంటూ ఇరాన్ చెప్పటం ట్రంప్ కి అస్సలు కునుకులేకుండా చేస్తున్నాయి. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్ ముగియడానికి కొన్ని గంటల ముందే ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియన్ సంచలన ప్రకటన చేశారు. తనతో సహా కోటి 40 లక్షల మంది ఇరాన్ పౌరులు దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గర్వించదగ్గ 14 మిలియన్ల మంది ఇరానియన్లు తమ ప్రాణాలను అర్పించేందుకు ముందుకొచ్చారు. నేను కూడా ఇరాన్ కోసం బలిదానానికి ఎప్పుడూ సిద్ధమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇరాన్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. అమెరికా హెచ్చరికలకు భయపడేది లేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మొండి వైఖరిని వీడటం లేదు. మంగళవారం రాత్రి 8 గంటల లోపు హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే ఇరాన్ మౌలిక సదుపాయాలపై విరుచుకుపడతామని హెచ్చరించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌర వసతులపై దాడులు చేయడం యుద్ధ నేరం అని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించినప్పటికీ.. ట్రంప్ మాత్రం తాను దేనికీ భయపడటం లేదని కుండబద్దలు కొట్టారు. ఇరాన్‌లోని ప్రతి వంతెనను, పవర్ ప్లాంట్‌ను నాశనం చేస్తామని.. ఇరాన్ దేశాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తామని చేసిన వ్యాఖ్యలు యుద్ధం తప్పదనే సంకేతాలను ఇస్తున్నాయి. ఇరాన్ మాత్రం 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించి, శాశ్వత పరిష్కారం కోసమే పోరాడుతామని తేల్చి చెప్పింది.

యుద్ధం కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో భీభత్సం సృష్టిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. సౌదీ అరేబియాలోని జుబైల్ పారిశ్రామిక నగరంలోని పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌పై ఇరాన్ దాడులు చేయడంతో భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక నగరాల్లో ఒకటిగా పేరొందిన జుబైల్‌లో SABIC ప్లాంట్ల వద్ద మంటలు చెలరేగాయి. 

ఇరాన్‌లోని అతిపెద్ద పెట్రో కెమికల్ కేంద్రమైన అసలుయేపై ఇజ్రాయెల్ శక్తివంతమైన దాడిని నిర్వహించింది. సౌదీ వైపు వస్తున్న ఏడు బాలిస్టిక్ క్షిపణులను అక్కడి రక్షణ దళాలు అడ్డుకున్నప్పటికీ.. కూలిన క్షిపణి శకలాలు విద్యుత్ కేంద్రాలపై పడటంతో నష్టం వాటిల్లింది. భద్రతా కారణాల దృష్ట్యా సౌదీ-బహ్రెయిన్‌లను కలిపే కింగ్ ఫహద్ వంతెనను కూడా అధికారులు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.

ALSO READ : యుద్ధం ఇక భీకరం

ఈ రక్తపాతంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 19వందల మందికి పైగా, లెబనాన్‌లో 14వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ సైనికులు, అమెరికా సర్వీస్ మెంబర్స్ కూడా ఈ పోరులో మరణించారు. గల్ఫ్ దేశాల ఆయిల్ క్షేత్రాలే లక్ష్యంగా దాడులు జరుగుతుండటంతో ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇరాన్ తన యువతను మానవ కవచాలుగా ఇంధన ప్లాంట్ల వద్ద మోహరిస్తుండగా.. ట్రంప్ మాత్రం తన డెడ్ లైన్ క్లాక్ ముగియగానే దాడికి సిద్ధమవుతున్నారు. మరికొన్ని గంటల్లో రాబోయే డెడ్ లైన్ ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఇది కేవలం ప్రాంతీయ గొడవగానే ఉంటుందా లేక ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనే భయాలు వ్యక్తం చేస్తున్నారు యుద్ధ నిపుణులు.